telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ప్రైవేటు విద్యా సంస్థల పరిస్థితిపై యాజమాన్యాల వినతి

school students

కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించడంతో అనేక రంగాలు ఆర్థిక సంక్షోభంతో కొట్టు మిట్టాడుతున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థల ప్రస్తుత పరిస్థితి కూడా దుర్బలంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రైవేటు విద్యా సంస్థల యూనియన్  లు తమ సమస్యలను వివరిస్తూ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు

గౌరవనీయులైన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు
తెలంగాణ రాష్ట్రం .

విషయం : తెలంగాణ రాష్ట్రం – ప్రైవేటు విద్యా సంస్థల ప్రస్తుత పరిస్థితి – కరోనాతో వాటిల్లిన ఆర్థిక ముప్పు – దుర్లభమైన పరిస్థితులలో యాజమాన్యం & సిబ్బంది జీవనం – మీ సహాయ సహకారముల గురించి.
****

ఆర్యా!
అకుంఠితదీక్షాపరులు ,కార్యసిద్ధులు ,మనో నిబ్బరంతో, మొక్కవోని ధైర్యంతో, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నాయకత్వం వహించి ప్రాణార్పణకు సైతం సిద్ధమై, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించి జనులందరి మన్నలను పొందుతూ ప్రజల అవసరాలను గుర్తించి దేశంలోనే ప్రథమంగా అనేక సంక్షేమ పథకాలతో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణను నిలిపి మా కొరకు అహర్నిశలు కృషి చేస్తూ మా పెద్దన్నగా అందర్నీ ఆదుకుంటున్న మా కేసీఆర్ గారికి …. బ్రతుకు చిద్రమై , జీవన్మరనానికి మధ్యలో ఉన్న ప్రైవేటు విద్యా సంస్థల బోధన ,బోధనేతర , ఇతర సిబ్బంది మరియు యాజమాన్యాల కన్నీటి విన్నపము.

మార్చి 14, 2020 లాక్ డౌన్ నుండి నేటి వరకు తమరి ఆదేశాలతో పాఠశాలలను మూసి ఉంచిన మేము మా జీవితకాలంలోనే అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాము. ప్రైవేటు స్కూల్స్ మనుగడకు ముఖ్య ఆధారం తల్లిదండ్రులు చెల్లించే ట్యూషన్ ఫీజు. మార్చి 14 నాటికి రమారమి 40 శాతం ఫీజు బకాయిలు ఉన్నవి. కనీసం పరీక్షల సమయానికైనా ఫీజు చెల్లించే తల్లిదండ్రులు, లాక్ డౌన్ వలన ఫీజు చెల్లించలేకపోయారు. అనంతరం తమరి ఆదేశాలతో విద్యార్థులందరూ పై తరగతులకు ప్రమోట్ చేయబడటంతో 40 శాతం బకాయిలు చెల్లింపులు చేయకుండా ఉండిపోయాయి. ఇది మొదటి దశగా తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలగజేసింది.

మా బాధ్యత కూడా అనుకుని, మేము స్వాగతించిన G.O.MsNo: 46 ద్వారా తమరి ఆదేశాలు అయిన 2020- 21 కి ఫీజు పెంపుదల వద్దు, నెలనెలా ఫీజులు మాత్రమే తీసుకోవాలి అనే ప్రకటన ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు ,రాష్ట్ర ప్రజల సంక్షేమం పట్ల మీ ప్రేమ వ్యక్తమైనప్పటికిని, సమస్య ఉన్నచో 100 డయల్ చేయమని చెప్పటం ప్రైవేటు స్కూల్స్ కు శరాఘాతమై యాజమాన్యాల చావుకొచ్చింది.
ఈ సమయంలో స్వార్ధపరులు కొందరు, తప్పుగా అర్థం చేసుకున్న మరికొందరు మీ ఆలోచన,ఆచరణలను వక్రీకరించి KCRగారు ఫీజు చెల్లించవద్దు అని అన్నారు అంటూ అందరినీ తప్పుదోవ పట్టించగా , ప్రైవేటు విద్యాసంస్థల తరపున మేము వివరించిననూ చేతులు కాలాక ఆకులు పట్టినట్లుగా మా ప్రయత్నాలు నిరుపయోగమైనవి అని వేదనతో మీ దృష్టికి తీసుకువచ్చుచున్నాము.

ఈ కారణంగా బడ్జెట్ ప్రైవేటు విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై స్పందించి ఆదుకొని మా అందరికీ జీవితాన్ని తిరిగి ప్రసాదించాలని వేడుకుంటూ తమరి దృష్టికి ఈ విషయములు,తిసుకవస్తున్నం:

ఆర్థిక పరిస్థితి:-

పేరెంట్స్ ఫీజు డ్యూస్ చెల్లించకపోవడం వలన మరియు 2020 – 21 కి నెలవారీ ఫీజులు రానందున , ఫీజు అడిగితే వందకు డయల్ చేస్తాము అని అనటం, కేసీఆర్ సార్ చెల్లించవద్దు అని చెప్పారు కదా అంటూ, ఫీజులు, బకాయిల చెల్లింపులు నిరాకరించుట వలన విద్యా సంస్థల ఆర్థిక వ్యవస్థ కుదేలై, మేము చేయవలసిన చెల్లింపులు చేయలేక మానసికంగా తీవ్ర ఒత్తిడులకు గురియై జీవచ్ఛవాల వలే యాజమాన్యం మరియు ప్రైవేటు పాఠశాల సిబ్బంది జీవిస్తున్నాము.

సిబ్బంది స్థితిగతులు:-

జీతాలు లేక జీవనాధారం కోల్పోయి నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది అనేక ఇతర రంగాల వైపు మరలిపోయారు. విద్యా వ్యవస్థలో ఇది
నైపుణ్యతాలేమిని తీసుకురాగా రేపటి తరాల భవిష్యత్తు అంధకారం అయ్యే సమస్య ఏర్పడి, వారి భవిష్యత్తు జీవనానికి తీవ్ర నష్టాన్ని కలగజేస్తుంది అని నిశ్చయముగా చెబుతున్నాము. మిగిలి ఉన్న మరికొందరు దిక్కుతోచక దినదినగండంగా జీవిస్తున్నారు. జీతాలు చెల్లించిన యెడల వారందరూ తిరిగి ఈ రంగం వైపు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నవి. ఇప్పటికే దాదాపు 15 మందికి పైగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వత్తిడి తట్టుకోలేక స్వర్గస్తులైనారు. రాబోయే కాలంలో ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నది అనే అనుమానంతో మీరు జోక్యం చేసుకొని పరిస్థితులను చక్కదిద్దాలని వేడుకుంటున్నాను.

ఆర్థిక చెల్లింపులు:-

a) మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందన 80 శాతం పైగా విద్యాసంస్థలు కిరాయి భవనాలలో పాఠశాలలను నిర్వహిస్తున్నందున, ఆర్థిక పరిస్థితి లేక భవన కిరాయిలు చెల్లించకపోవడంతో కిరాయి చెల్లించాలని లేనిచో భవనాన్ని ఖాళీ చేయాలని యజమానులు ఒత్తిడి చేస్తున్నారు.

b) బ్యాంకు లోన్ , బస్సు ఇన్స్టాల్మెంట్ లు, ఇతర EMI లు చెల్లించలేక పోవుట చేత ఆ సంస్థలు ఫోన్ ద్వారా ఒత్తిడి తెస్తూ మరియు నోటీసులు ఇస్తూ మా పరిస్థితిని మరింత కఠినతరం చేశాయి.

c) కరెంటు బిల్లులు చెల్లించలేకపోవడం చేత అనేకచోట్ల పాఠశాలలకు విద్యుత్ కనెక్షన్లు తొలగించబడ్డాయి.

d) ప్రాపర్టీ టాక్స్ కొరకు మున్సిపల్ సిబ్బంది ఒత్తిడి రోజురోజుకు అధికమవుతున్నది , టాక్స్ లు చెల్లించలేకపోతున్నాము.

e) మీ చెల్లింపులు మరియు కుటుంబ అవసరాలు తీర్చుటకు మాకు డబ్బులు కావాలి, అది ఫీజులు రూపంలోనే రావాలి తప్ప మాకు వేరే మార్గం లేదు దయచేసి గమనించాలి అని విజ్ఞప్తి.
విద్యా సంస్థపై వచ్చే ఫీజులే మాకు ఏకైక ఆదాయవనరులు చేతిలో చిల్లిగవ్వలేక కుటుంబ సభ్యులు ,పిల్లల అవసరాలు తీర్చలేక సతమతమవుతున్నాము.

నారాయణ , శ్రీ చైతన్య, ఇతర కార్పొరేట్ విద్యా సంస్థల వలన సమస్యలు::
తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర పెత్తనం కొనసాగదు అని ఉద్యమంలో అందరూ చెప్పగా నమ్మిన మేము, నేడు దగా పడ్డాము. నారాయణ , శ్రీచైతన్య వంటి కార్పొరేట్ విద్యాసంస్థలు రాష్ట్రం నలుమూలల పదుల సంఖ్యలో విద్యాసంస్థలు నెలకొల్పుతూ చిన్న పాఠశాలలను భయపెట్టి , డబ్బుతో వాటిని కొని విద్యా మాఫియాకు తెరలేపాయి.
ఈ సమయంలో మా విద్యాసంస్థలతో చమ్మచక్క ఆడుతున్న కార్పొరేట్ రంగం పై పోరుకు ఎవరి సహకారం అందక మేము సమాజంలో మూడవ జాతిగా మిగిలిపోయాము.
పాత బకాయిల చెల్లింపులకు సహకరిస్తే మేము మా సంస్థలను మూసివేసి, కుటుంబాలతో జీవించలేక, కఠిన నిర్ణయాలు తీసుకొని నారాయణ చైతన్య వంటివారి ఏకచ్ఛత్రాధిపత్యానికి సహకరిస్తూ పైలోకాల నుండి ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉన్నాము.
ఇది అంతా మన సమాజంలోని కొందరు పెద్దల వలన సాధ్యపడిందని విశ్వసిస్తూ బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ ను మీ బిడ్డలగా తలచి కాపాడాలని మీకు విన్నవించుకుంటున్నాము.

ప్రస్తుత పరిస్థితి:-

విద్యా సేవలో నిమగ్నమై 11500 పాఠశాలలతో, 5 లక్షల పైగా సిబ్బందితో లక్షలాది మంది విద్యార్థులతో తెలంగాణ కొరకు బాధ్యతాయుతంగా భవిష్యత్తు తరాల కొరకు పని చేస్తున్నాము. హైదరాబాదుతొ సహా ముప్పై మూడు జిల్లాలలో 10 వేల వరకు బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఫీజులు తప్ప వీటికి వేరే ఆదాయ మార్గం లేదు.
వ్యవస్థాగతంగా ఇబ్బంది ఉన్నా , ఆర్థిక పరిస్థితి సహకరించక పోయినా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అత్యంత ఖర్చుతో కూడుకున్న ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాము. అయినను ఫీజు చెల్లింపులకు తల్లిదండ్రులు ముందుకు రావటం లేదు.
లాక్ డౌన్ సడలింపుల తర్వాత విద్యారంగం తప్ప దాదాపు అన్ని రంగాల్లోని వారు వ్యాపార నిర్వహణ చేస్తూ ఆర్థికంగా మంచి స్థితికి చేరుకున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందుతున్నాయి.
అయ్యా! మేము విద్యావేత్తలం, మేధావి వర్గానికి చెందిన వారము. వయసు దృష్ట్యా ,విద్యార్హతల దృష్ట్యా ఇతర పనులు కానీ, ఇతర వ్యాపారాలు కానీ చేయలేనివారము. దయచేసి గమనించగలరు అని మనవి.

మీ సహకారం
పై విషయంలో అన్నింటిని గమనించి మాపై మీ దయ ఉంచి రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా ప్రైవేటు విద్యాసంస్థల పాత బకాయిలు, ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నందున నెలవారీ ఫీజు చెల్లింపులను చేయవలసినదిగా సూచించాలని కోరుతున్నాము. ఇందువలన మా అవసరములు తీరి యాజమాన్యం, సిబ్బంది మరియు ఇతర అనుబంధ చెల్లింపులతో అందరము మీ దయతో పూర్వ జీవనాన్ని జీవించగలము.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అర్థం చేసుకున్నప్పటికీ ,మా జీవనం కొరకు బడ్జెట్ ప్రైవేటు విద్యా సంస్థల సిబ్బందికి, యాజమాన్యానికి పాఠశాల పున ప్రారంభం అయ్యేవరకు దయతో తగు సహాయం అందించాలని మేము ప్రార్థిస్తున్నాము. లేనియెడల కేవలము మీ మాటగా రాష్ట్ర ప్రజలకు విద్యాసంస్థల మనుగడ సహకరించాలని , ఉపాధ్యాయులు , సిబ్బంది కుటుంబ జీవితాల దృష్ట్యా ఫీజు చెల్లింపులు చేయాలని తల్లిదండ్రులకు తెలియజేయగలరు .
దయతో సహకరించాలని మనవి చేస్తున్నాము.

వినమ్రతతో మీ
యాదగిరి శేఖర్ రావు
రాష్ట్ర అధ్యక్షులు

ఎస్ మధుసూదన్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

పి నాగేశ్వరరావు
రాష్ట్ర కోశాధికారి
తెలంగాణ ట్రాస్మా

Related posts