telugu navyamedia
తెలంగాణ వార్తలు

బండి సంజయ్ కి బెయిల్ మంజూరు..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి హైకోర్టులో ఊరట లభించింది. కరీంనగర్ లో ఉద్యోగుల, ఉపాధ్యాయుల బదిలీల్లో అన్యాయం జరిగిందని బాధిత ఉపాధ్యాయులతో కలసి జాగరణ దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు బలవంతంగా అరెస్టుచేశారు. కరీంనగర్ కోర్టుకు హాజరు పరచిన నేపథ్యంలో కోవిడ్ నియమావళిని పాటించలేదని, నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలపై నాన్ బెయిలబుల్ కేసులను నమోదు చేయడంతో కరీంనగర్ జిల్లా కోర్టు బెయిల్ కు నిరాకరించింది. దీంతో 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు.

కరీంనగర్ జిల్లా కోర్టు తీర్పును సవాలు చేస్తూ… కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు విధించిన రిమాండును రద్దుచేయాలని హైకోర్టును బండి సంజయ్ అభ్యర్థించారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి… బండి సంజయ్ కు బెయిల్ మంజూరు చేశారు. దీంతో ఆయన జిల్లా జైలునుంచి విడుదల కాబోతున్నారు.

హైకోర్టు ఉత్తర్వులు అందిన తర్వాత… కరీంనగర్ జిల్లా జైలునుంచి విడుదల కానున్నారు. బండి సంజయ్ ను విడుదలచేయాలనే డిమాండుతో తెలంగాణ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు బండి సంజయ్ కు బెయిల్ మంజూరు చేయడంతో బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. కరీంనగర్ జిల్లా జైలునుంచి బండిసంజయ్ ను భారీ ప్రదర్శనతో తీసుకురావాలని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.

Related posts