ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ మరోసారి మొండిచేయి చూపింది. మరో నెల కూడా ఉద్యోగుల జీతాల్లో కోతను విధించింది. లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోవడంతో మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉద్యోగుల జీతాల్లో కోత విధించారు.అయితే లాక్ డౌన్ సడలింపుల తర్వాత సాధారణ పరిస్థితులు రావడంతో ఈ నెల పూర్తి జీతం వస్తుందని ఉద్యోగులు భావించారు.
కానీ ఈ నెల కూడా ఉద్యోగులకు సగం జీతం మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోత విధించిన జీతాన్ని తర్వాత చెల్లిస్తామని ప్రభుత్వం చెపుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల అయినా పూర్తి జీతం వస్తుందని భావించిన ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయంతో షాక్ తిన్నారు.