telugu navyamedia
తెలంగాణ వార్తలు

సొద‌రిగానైనా గౌర‌వించాలి.. కావాలనే అవ‌మానిస్తున్నారు.. – గవర్నర్ తమిళిసై

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి సంచలన కామెంట్స్‌ చేశారు. నిన్న ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఆమె.. ఇవాళ హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశమై.. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, తనకు ఎదురైన అనుభవాలు, కేసీఆర్‌ ప్రభుత్వం అవలంభిస్తోన్న విధానాలు.. తదితర అంశాలపై చర్చించారు..

అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు… తెలంగాణ ప్రజలకు మేలు జరిగేలా హోంమంత్రితో చర్చించానని అన్నారు. అయితే అమిత్‌ షాతో ఏం చర్చించానో బయటకు చెప్పలేనని అన్నారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే ఎప్పుడూ ఆలోచిస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణ‌లో ఏం జ‌రుగుతుందో తెలిసిందేన‌న్నారు. గ‌వ‌ర్నర్ ను ఎందుకు అవ‌మానిస్తున్నారో తెలంగాణ వాసులే తెలుసుకోవాలన్నారు.ఎవ‌రి స‌హ‌కారం అంద‌క‌పోయినా ముందుకు వెళ్తాన‌ని ఆమె తెలిపారు.

తెలంగాణ గ‌వ‌ర్నర్ ప‌ర్యటించాలంటే రోడ్డు మార్గమే దిక్కని అన్నారు. భద్రాచలం శ్రీరామనవమి ఉత్సవాలకు హాజరవుతానని వెల్లడించారు. రైలు, లేదా రోడ్డుమార్గంలోనే భద్రాచలం వెళ్తానని స్పష్టం చేశారు. మేడారం జాతరకు కూడా రోడ్డుమార్గంలోనే వెళ్లానని గుర్తు చేశారు. రోడ్డుమార్గంలో 5 గంటలపాటు ప్రయాణించి మేడారం వెళ్లానని తెలిపారు.

 తనపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. ప్రొటోకాల్ పాటించడం లేదని.. వ్యక్తిగతంగా తనను అవమానించినా భరిస్తానని, కానీ వ్యవస్థకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అయితే , రాజ్ భవన్ డోర్స్ ఎప్పుడూ తెరిచే ఉంటాయి.. ముఖ్యమంత్రి, మంత్రులు ఎప్పుడయినా రావొచ్చు అన్నారు.

యాదాద్రి ఆలయానికి వెళ్లినప్పుడు అధికారులు ఎందుకు రాలేద‌ని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పటికీ ..యాదాద్రికి తాను బీజేపీ వ్యక్తిగా వెళ్లానని వాళ్లు ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. రెండేళ్లలో తాను బీజేపీ నాయకులను కేవలం ఒకటి, రెండుసార్లే కలిశానని తెలిపారు.

ఉగాది వేడుకలకు తాను ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించానని చెప్పారు. రాజ్‌భవన్‌కు ఏ పార్టీతోనూ సంబంధం ఉండదన్నారు. రిపబ్లిక్ డే, ఉగాది కార్యక్రమాలకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

ఇది తమిళిసై సమస్య కాదని.. గవర్నర్ ఆఫీస్‌కు జరుగుతున్న అవమానమని అన్నారు.. తాను ఎవరినీ విమర్శించట్లేదని వెల్లడించారు. రాజ్‌భవన్‌, గవర్నర్ విషయంలో తెలంగాణలో ఏం జరుగుతుందో మాత్రమే చెప్తున్నానని వివరించారు. ఒక మహిళకు గౌరవం ఇవ్వాల్సిన విధానం ఇది కాదని అన్నారు.

Related posts