telugu navyamedia
తెలంగాణ వార్తలు

అధికారుల దృష్టికి తీసుకెళ్తా, ఆరోగ్యం జాగ్రత్త : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు గవర్నర్ బాసట

నిర్మల్ జిల్లాలోని గత మూడురోజులుగా బాస‌ర ట్రిపుల్ ఐటీ లో విద్యార్ధుల ఆందోళనపై తెలంగాణ‌ గవర్నర్ తమిళి సై సౌందర్యరాజన్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. టీఎస్ సీఎంవో కు తమిళి సై ట్యాగ్ చేశారు.

మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని గవర్నర్ విద్యార్ధులకు సూచించారు. మీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని త‌మిళ‌సై చెప్పారు. వర్షంలో కూడా విద్యార్ధులు ఆందోళన చేస్తున్న విషయమై గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఏ లక్ష్యసాధన కోసం ట్రిపుల్ ఐటీలో చేరారో ఆ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని ఆమె విద్యార్ధులకు సూచించారు. మీ పేరేంట్స్ కలలు, మీ లక్ష్యాలను నెరవేర్చుకోవాలని ఆమె విద్యార్ధులను కోరారు.

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మూడు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. తమ 12 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అర్ధరాత్రి 12 గంటల వరకు వారు వర్షాన్ని సయితం లెక్క చేయకుండా ఆందోళన చేస్తున్నారు.

ఆందోళన చేస్తున్న విద్యార్ధులతో జిల్లా అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రూ. 12 లక్షలను తక్షణమే విడుదల చేస్తామని కూడా అధికారులు ప్రకటించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ లేదా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించి తమకు కచ్చితమైన హామీని ఇస్తేనే తాము ఆందోళన విరమిస్తామని ఆందోళనకారులు ప్రకటించారు.

Related posts