telugu navyamedia
ఆంధ్ర వార్తలు

తెలంగాణలో రైతు విలాపం…

కష్టపడి పండించుకున్న ధాన్యం దిగుబడులతో తెలంగాణ రైతులు దిగాలు చెందుతున్నారు. కళ్లాల్లో ఆరబెట్టుకున్న ధాన్యం వర్షానికి తడిచి… వర్షపునీటికి కొట్టుకుపోయిన ధాన్యం కొంతైతే… మిగిలిన వాటిలో మొలకెత్తిన ధాన్యం కొంత… పాడైన ధాన్యం మరికొంత… చేతికొచ్చిన పంట ఫలితాన్ని అనుభవించలేని దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కళ్లాల్లో ధాన్యం కాపాడుకోవడం ఒక ఎత్తైతే… మరికొందరు రోడ్లపై ధాన్యం రాశుపోసి ముప్పుతిప్పలు పడుతున్నారు.

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఎటుజూసినా ఒకటే గోస… తిండిలేక కళ్లాల వద్ద తిప్పలుపడుతున్న రైతులు… కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యం రాశులు… మొలకెత్తినవి… మక్కిపోయినవి… రైతులకు కన్నీటిని తెప్పిస్తున్నాయి. కొన్నిచోట్లు రైతులు కళ్లెదుట పాడైన ధాన్యంచూసి కుమిలిపోతున్నారు. పాలకుల మాటలకు… అధికారుల చేతలకు పొంతనలేకున్నాయి.

తెలంగాణలో 62 లక్షల ఎకరాల్లో వరిసాగు అయ్యిందని ప్రభుత్వమే చెబుతోంది. పంటదిగుబడులు రైతుల చేతికి వచ్చి నెల రోజులు అవుతున్నా… ప్రభుత్వం కేవలం 11 లక్షల క్విటాళ్లు మాత్రమే కొనుగోలు చేసిందని సమాచారం. రాష్ట్రంలో ఐకెపి, సహకార సంఘాల ద్వారా 6,772 కొనుగోలు కేంద్రాలు తెరవాల్సి ఉండగా ఇప్పటిదాకా 4, 743 కేంద్రాలను మొక్కుబడిగా ప్రారంభించారని అధికారిక సమాచారం. కొనుగోలు జరిగిన ధాన్యానికి 2,100 కోట్ల రూపాయలు మేర రైతులకు చెలించాల్సి ఉండగా, ఇప్పటిదాకా కేవలం 116 కోట్లరూపాయలు మాత్రమే ఇప్పటి వరకు చెల్లించారని తెలుస్తోంది.

కొందరు రైతులు కళ్లాల వద్ద ధాన్యం కాపాడుకోడానికి అవస్థలు పడుతుంటే… మరికొందరు రైతులు కొనుగోలు కేంద్రాలవద్ద తూకం వేసుకోడానికి ముప్పు తిప్పలు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశామని నాయకులు గొప్పలు చెబుతున్నారు… వాస్తవికంగా రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పాడైన ధాన్యం కొనుగోలు చేయరు. తడిచిన ధాన్యం కొనుగోలుకు కాస్తా సమయం పట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకెళ్తే… తరుగుపేరుతో తగ్గింపు… ధాన్యం కేంద్రాలవద్దకు తీసుకుకెళ్లిన రైతులు… కొనుగోలు కేంద్రాలవద్ద పడిగాపులు గాస్తున్నారు.

ఆర్భాటంగా ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిలువలు పేరుకుపోయాయి… అధికారులు కనికరించడంలేదు… పాలకులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద 15 రోజుల నుండి ధాన్యం పోసి, దాని చుట్టే తిరుగుతున్నారు.. వర్షాలకు తడుస్తున్నాయి. ఎండకు ఎండుతున్నాయి తప్ప కొనుగోలు లేదు.. ఒకవైపు చెదురు ముదురు వర్షాలు, దీనికి తోడు మంచు, ఇంకో వైపు కొనేవారు లేక ఏం చేయాలో తెలియక దిక్కు తోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. అమ్ముకుందామని తెచ్చుకున్న ధాన్యం వర్షానికి తడిచి మొలకలెత్తడంతో రైతులు కుప్పకూలిపోతున్నారు.

అధికారులు కూడా చేసేది ఏమి లేక అటు వైపు కూడా తొంగిచూడడం లేదు.. అక్కడక్కడా రెండు రోజుల నుండి కాంటా పెడుతున్నారు. కానీ పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడంలేదు.. ధాన్యం నిల్వ సామర్థ్యంలేక కొనుగోలుచేయలేకపోతున్నామని చేతులెత్తేస్తున్నారు. ఇంతకీ రైతుల్ని ఎవరు ఆదుకుంటారు? భరోసా ఇచ్చేదెవరు? ముప్పుతిప్పలు పడుతున్న రైతుల జీవితాలతో పరిహాసమాడుతున్న పాలకులు ఆత్మస్థయిర్యాన్ని పెంపొందించలేకపోతున్నారు. ప్రతిపక్ష రాజకీయనాయకులు మాత్రం అడపాదడపా రైతుల్ని పరామర్శించి ఓదారుస్తున్నారు.

రైతుల కన్నీటితో చెలగాటమాడితే…. భవిష్యత్తులు రాజకీయనాయకుల తలరాతలు మారుతాయని తెలంగాణలో రైతు దయనీయ పరిస్థితులు హెచ్చరిస్తున్నాయి.

Related posts