telangana congress status for 2019 elections

తెలంగాణాలో ఢీలా పడుతున్న కాంగ్రెస్!

19

ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో తెలంగాణాలో రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ ఢీలా పడుతున్నట్టు తెలుస్తోది. ఓ వైపు నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పార్టీలో పెను దుమారాన్ని లేపాయి. మరో వైపు నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో డీకే అరుణతో పాటు ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, నాగం చేరికను వ్యతిరేఖించారు. అధిష్టానం మాట్లాడకుండా నాగం జనార్దన్‌రెడ్డిని పార్టీలోకి తీసుకోవడం సరైంది కాదని డీకే అరుణ అన్నారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగానే జరిగిందని తెలిపారు. నాగర్‌కర్నూల్‌లో మొదటి నుంచి కాంగ్రెస్‌కు అండగా ఉన్న సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి తెరాస లో చేరేందుకు ముహూర్తము ఖరారైంది. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో దామోదర్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరనున్నారు. ఆయనతో పాటు పలువురు కార్యకర్తలు, అభిమానులు కూడా పార్టీలో చేరే అవకాశము ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పార్టీనీ ఓడించేందుకు నేతలు కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఆదేశించినప్పటికీ ఆ పాఆర్టీ ముఖ్య నేతలు వ్యవహరిస్తున్న తీరు అధిష్టానికి తలనొప్పిగా మారినట్టు స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన రైతు బంధు పథకం చెక్కులను రైతులకు పంపిణీ చేస్తూ, ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలు అన్ని జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర ద్వారా ఆయా జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొంత మేరకు ఉత్సాన్ని నింపింది. అయినప్పటికీ పార్ట్ సీనియర్ నాయకులు పార్టీ మారడంతో ఆ పార్టీ ఢీలా పడే అవకాశాలున్నట్లు స్పష్టమవుతోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వేలు, ఇంటలిజెన్స్ రిపోర్ట్ ల నేపథ్యంలో ఎమ్మెల్యేల పని తీరును ఆరా తీస్తున్నారు. గెలుపుకు అవకాశం లేని వారి గురించి ఆయన హెచ్చరికలు సైతం చేస్తున్నారు. ఇప్పటికే 35 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేదని నివేదికలు అందిన నేపథ్యంలో వారిపై సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. వీరిలో కొంత మందికి టికెట్లు దక్కక పోవచ్చని, ఆ స్థానాల్లో కొత్త్తగా పార్టీలో చేరిన వారికి టిక్కెట్లు ఇచ్చే అవకాశం ఉందని భావించి, మరికొంత మంది కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు తెరాస తీర్థం పుచ్చుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.