telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

తెలంగాణ కాంగ్రెస్ .. తొలిజాబితా.. !

T Congress boycott mlc elections

కాంగ్రెస్ అధిష్ఠానం లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలోకి దిగబోతున్న 8 మంది పేర్లను విడుదల చేసింది. సోనియా గాంధీ నివాసంలో శుక్రవారం రాత్రి సుదీర్ఘంగా సాగిన సమావేశం అనంతరం ఎనిమిది మంది అభ్యర్థులను ఖరారు చేశారు. నేడో, రేపో మరో 9 మంది అభ్యర్థులను ప్రకటించనున్నారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ అధ్యక్షతన జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో సోనియాగాంధీ, ఏఐసీసీ కోశాధికారి అహ్మద్‌ పటేల్‌, సీఈసీ సభ్యులు వీరప్ప మొయిలీ, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.

తొలి జాబితా ప్రకారం.. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఈసారి మల్కాజిగిరి నుంచి పోటీ చేయబోతున్నారు. ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బరిలోకి దిగనుండగా, జహీరాబాద్ స్థానానికి మదన్ మోహన్‌రావుకు అవకాశం లభించింది. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. ఇటీవల ఎన్నికల సందర్భంగా పార్టీలో చేరిన గాలి అనిల్ కుమార్‌ను మెదక్ నుంచి బరిలోకి దింపుతుండగా, మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ మరోమారు అవకాశం దక్కించుకున్నారు. పెండింగ్‌లో ఉన్న ఖమ్మం, నల్గొండ, భువనగిరి, వరంగల్‌, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, నిజామాబాద్‌ స్థానాలకు శని, ఆదివారాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

Related posts