telugu navyamedia
తెలంగాణ వార్తలు

దేశానికి ప్ర‌ధాని కాదు సేల్స్‌మెన్‌..- మోదీపై సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

*కేసీఆర్ కేంద్రంపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
*దేశానికి  ప్ర‌ధాని కాదు సేల్స్ మెన్‌..
*మ‌హారాష్ర్ట‌లో థాక్రే ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టిన‌ట్టుగా..తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొడ‌తామంటున్నారు..
*జాతిపితాను కూడా అవ‌మానిస్తున్నారు..
*శ్రీలంక‌లో ఏం జ‌రిగిందో చెప్పండి..
*దేశంలో మార్పు త‌ప్ప‌దు..
*రాష్ర్ట ప్ర‌భుత్వాల‌ను కూలుస్తారా?

మోదీ పాల‌న‌లో ఏ ఒక్క‌రూ సంతోషంగా లేర‌ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా హైదరాబాద్ జలవిహార్‌లో టీఆర్ఎస్ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ..  సీఎం కేసీఆర్​ మ‌రోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు.  మోదీ పాల‌న‌లో ఏ ఒక్క‌రూ సంతోషంగా లేర‌ని పేర్కొన్నారు.

మోదీ దేశం ముందు తలదించుకున్నారంటూ కేసీఆర్​ వ్యాఖ్యానించారు. స్విస్​ బ్యాంకు నుంచి ఎన్ని డబ్బులు ఇండియాకు తిరిగి వచ్చాయని పీఎం​ మోదీని ప్రశ్నించారు. మోదీ దేశానికి ప్రధానిలా కాకుండా సేల్స్​మ్యాన్​లా వ్యవహరిస్తున్నారని కేసీఆర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మోదీపై తనకు ఎలాంటి వ్యక్తిగత కక్ష్యలు లేవని , మోదీ విధానాల‌తోనే త‌మ‌కు అభ్యంత‌ర‌మ‌ని పేర్కొన్నారు .

మోదీ తీరుతో శ్రీలంక‌లో ప్ర‌జ‌లు నిర‌స‌న‌లు తెలిపార‌ని గుర్తుచేశారు. శ్రీలంక చేసిన ఆరోప‌ణ‌లపై ప్ర‌ధాని మౌన‌మెందుకు వ‌హిస్తున్నార‌ని సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు. శ్రీలంక విష‌యంలో స్పందించ‌కుంటే ప్ర‌ధాని మోదీని దోషిగానే చూడాల్సి వ‌స్తుంద‌న్నారు.

ప్రధాని మోదీ ఈరోజు హైదరాబాద్ వస్తున్నారని.. రెండు రోజులు మోదీ ఇక్కడ ఉండబోతున్నారని చెప్పారు. రేపటి సభలో తమ గురించి బాగానే మాట్లాడబోతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ ప్రతిపక్ష నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మేం వేసిన ప్రశ్నలకు హైదరాబాద్ వేదికగా ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మోదీ ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటి నెరవేరలేదని అన్నారు. టార్చిలైట్ వేసి వెతికినా మోదీ హామీలు నెరవేర్చినట్టుగా కనిపించవన్నారు. దేశాన్ని అన్ని విధాలుగా బీజేపీ నాశనం చేసిందని, ఎవరిని అడిగినా ఇదే మాట చెబుతారని ఎద్దేవా చేశారు. తమకు మించిన మేధావులు ఇంకెవరూ లేరని బీజేపీ నేతలు అనుకుంటున్నారని అని అన్నారు.

రైతులు, సైనికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇబ్బందిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని తెలిపారు. ప్రధానిగా కాకుండా… దేశానికి సేల్స్‌మెన్‌గా మోదీ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ తీరుతో శ్రీలంకలో ప్రజలు నిరసనలు తెలిపారని చెప్పారు. మోదీ పనితీరుతో అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ఠ దిగజారుతోందని కేసీఆర్ విమర్శించారు.

Related posts