ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి విజయం సాధించిన సందర్భంగా తెలంగాణ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు పిచ్చి పంథా ఎంచుకున్నారని సీఎం అన్నారు. కార్మికులు అర్థంపర్థం లేనటువంటి, దురహంకార పద్ధతిని అవలంబిస్తున్నారని అన్నారు. నాలుగేళ్ల కాలంలో 67 శాతం జీతాలు పెంచిన ఘనత ఎవరికైనా ఉన్నదా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇంత పెంచిన తర్వాత కూడా గొంతెమ్మ కోరికలు కోరుతామంటే అర్థం ఉందా అని ప్రశ్నించారు.
ఎవరు పడితే వారొచ్చి, గవర్నమెంట్‌లో కలపమంటే కలుపుతారా అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి 57 కార్పొరేషన్లు ఉన్నాయని, ఇవాళ మిమ్మల్ని కలిపితే రేపు వాళ్లు దారి పడితే ఏం చెప్పాలని ఆయన నిలదీశారు. ఆర్థికమాంద్యం వచ్చిందన్న విషయాన్ని ప్రగల్భాలు లేకుండా నేరుగా ప్రజలకు చెప్పానని ఆయన తెలిపారు. ఇలాంటి సమయంలో ఆర్టీసీ కార్మికుల ధోరణి సరికాదని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల వైఖరిని తాను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించనని కేసీఆర్ స్పష్టం చేశారు.