తెలంగాణ శాసనసభ తొలి సమావేశాలు గురువారం నుండి ప్రారంభం కానున్నాయి. ఎన్నికలు ఫలితాలు వచ్చిన 36 రోజుల తర్వాత ప్రారంభమవుతున్న ఈ సమావేశాలు నాలుగు రోజులపాటు జరుగుతాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన శాసన సభ్యులచేత తాజాగా బాధ్యతలు చేపట్టిన ప్రోటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. శాసనసభా నాయకుడైన ముఖ్యమంత్రి కెసిఆర్ చేత తొలుత శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
ఆ తర్వాత మహిళా సభ్యుల ప్రమాణం జరుగుతుంది. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం సుమారు రెండు గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. 19న ఉభయసభల సమావేశంలో గవర్నర్ ప్రసంగిస్తారు. 20న శాసనసభ, మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించి ఆమోదిస్తారు. అనంతరం శాసనసభ స్పీకర్ ఎన్నికకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ కూడా గురువారమే ప్రారంభం కానుంది.