telugu navyamedia
తెలంగాణ వార్తలు

నేటి నుంచే తెలంగాణ‌ శాసనసభ సమావేశాలు..

తెలంగాణ‌ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఇవాళ ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజే ప్రభుత్వం 2022-23 వార్షిక బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. 

ఉభయసభలు ప్రొరోగ్ కానందున గత అక్టోబర్​లో జరిగిన సమావేశాలకు కొనసాగింపుగానే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో వీటిని ఏడాదిలో మొదటి సమావేశాలుగా పరిగణించనందున ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం వుండదని ప్రభుత్వం తెలిపింది.

కేబినెట్ బడ్జెట్‌కు ఆమోదముద్ర

ముఖ్యమంత్రి కేసీఆర్‌  అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమావేశమైన కేబినెట్ బడ్జెట్‌కు  ఆమోదముద్ర వేసింది. కేసీఆర్ ఆదేశాల ప్రకారం ప్రతి వర్గానికి లబ్ది చేకూరేలా బడ్జెట్ ను అధికారులు రూపొందించారు. ఇప్పటికే ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఉచిత విద్యుత్తు, గొర్రెల పంపిణీ, రైతు బంధు వంటి పథకాలను కొనసాగిస్తూనే ప్రతి దళిత కుటుంబానికి పది లక్షలు ఇచ్చేలా రూపొందించిన పథకానికి కూడా పెద్ద యెత్తున నిధులు ఈ బడ్జెట్ లో కేటాయించినట్లు తెలిసింది. నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్తు, వైన్ షాపుల్లో గౌడ, ఎస్సీ కులాలకు రిజర్వేషన్లు వంటి వాటితో ఇప్పటికే ఆ వర్గాలను కేసీఆర్ఆ కట్టుకున్నారు.

హరీశ్‌రావుకు మూడో బడ్జెట్‌..

తొలిరోజే రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను సమర్పించనున్నారు. టీఆర్‌ఎస్‌ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక 2019-20లో బడ్జెట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆర్థికమంత్రిగా హరీశ్‌రావు 2020-21 నుంచి వార్షిక బడ్జెట్‌ను సభకు సమర్పిస్తున్నారు. దీంతో మంత్రి హరీశ్‌రావుకు ఇది మూడో బడ్జెట్ అవుతుంది.

బీఏసీ సమావేశం

ఉభ‌య స‌భ‌ల్లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన  అనంతరం( BAC )బీఏసీ సమావేశమవుతుంది . స్పీకర్‌ అధ్యక్షతన అసెంబ్లీలో, సయ్యద్‌ అమినుల్‌ హసన్‌ జాఫ్రీ అధ్యక్షతన మండలిలో బీఏసీ సమావేశం వేర్వేరుగా నిర్వహించనున్నారు. బీఏసీ భేటీల్లో బడ్జెట్ సమావేశాల ఎజెండాను ఖరారు చేయనున్నారు..

కాగా..సోమవారం ఉదయం నుంచి మొద‌ల‌య్యే ఉభ‌య స‌భ‌లు.. రెండు వారాల పాటు జ‌రిగే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related posts