ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను వైసీపీ నాయకులు నాశనం చేశారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కొత్త పారిశ్రామిక విధానంపై ధ్వజమెత్తారు. నూతన పారిశ్రామిక విధానంతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని విమర్శలు గుప్పించారు. ఉపాధి కల్పనకు, భవిష్యత్ తరాలకు ప్రయోజనం లేదన్నారు.
వైసీపీ నిర్వాకాల వల్లే పారిశ్రామికరంగంలో మైనస్ 2.2% వృద్ధి సాధించారని ఎద్దేవా చేశారు. తయారీ రంగం, నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ రంగాలన్నీ తిరోగమనంలోనే ఉన్నాయన్నారు. ఈ 14నెలల్లో లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని అన్నారు. చివరికి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సగం జీతాలే అని ఆయన మండిపడ్డారు.
క్రెడిట్ రేటింగ్ పడిపోయిందని, పెట్టుబడులు వెనక్కి పోయాయని తెలిపారు.టీడీపీ ఏడాదికి సగటున రూ.1066 కోట్లు కేటాయిస్తే, వైసీపీ పెట్టింది రూ.852 కోట్లే అని దుయ్యబట్టారు. బలహీన వర్గాల వారికి, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే అవకాశం కాలరాశారని యనమల దుయ్యబట్టారు.