పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఏకపక్షంగా వ్యవహరిస్తోందని టీడీపీ మహిళా నేత సాదినేని యామిని మండిపడ్డారు. టీడీపీ 150కి పైగా ఫిర్యాదులు చేసినా ఈసీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈసీ జగన్ కే అనుకూలంగా ఉందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ పేరును వైసీపీ కమిషన్ అనో, బీజేపీ కమిషన్ అనో పెడితే బాగుంటుందని ఆమె ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత ప్రతిపక్ష నేత జగన్ ఐదేళ్లపాటు హైదరాబాద్ లోటస్ పాండ్ లోనే ఉండిపోయాడని అన్నారు.
ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా రాదని తెలిసీ లోటస్ పాండ్ నుంచి సామాన్లతో సహా అమరావతి వచ్చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండాలన్న విషయం కూడా తెలియని వ్యక్తి జగన్ అని పేర్కొన్నారు. ఢిల్లీ అధినాయకత్వం రాష్ట్రంపై కక్ష కడితే ఇంటి దొంగలు శత్రువులకు ద్వారాలు తెరిచి కూర్చున్నారని ఆరోపించారు. మోదీ నిరంకుశ రాజుల పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. అడ్డొచ్చిన ప్రతిపక్షాలను, మీడియాను, ఆఖరికి ప్రజలను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.