ఎస్ఈసీ నియామక నిబంధనల ప్రకారం వయసు 65 ఏళ్ల దాటకూటదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 65ఏళ్ల లోపు ఉన్న రమేష్ కుమార్‌ని అర్ధాంతరంగా తొలగించి..ఆ స్థానంలో 84 ఏళ్ల కనగరాజ్ ను చెన్నై నుంచి తీసుకొచ్చి నియమించారని విమర్శించారు. రమేష్ కుమార్ తొలగింపును రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ గంట కూడా ఆపలేకపోయారని సోమిరెడ్డి విమర్శించారు.
గవర్నర్ ఎందుకు భయపడ్డారని ప్రశ్నించారు. రమేష్ కుమార్‌ని భయపెట్టినట్లు గవర్నర్‌ని కూడా భయపెట్టారా? అని అన్నారు. ప్రథమ పౌరుడిగా మంచి నిర్ణయాలు ఎందుకు తీసుకోలేకపోతున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉందని, దీనిని గవర్నర్ నివృత్తి చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.
కరోనా కారణంగా ఏపీలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను రమేశ్ కుమార్ నాడు వాయిదా వేయడం ద్వారా ఆ మహమ్మారి బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడారని, ఆయన నిర్ణయాన్ని సుప్రీం కోర్టు కూడా సమర్ధించిందని గుర్తుచేశారు. రాజ్యాంగానికి లోబడే పరిపాలించాలన్న విషయాన్ని సీఎం జగన్ గుర్తుంచుకోవాలని సూచించారు.