మాజీ మంత్రి, టీడీపీ పార్టీ నేత అచ్చెన్నాయుడి అరెస్టుపై ఆ పార్టీ నేత నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడి గారి అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాయని అన్నారు. కక్ష సాధింపులో భాగంగానే వైఎస్ జగన్.. బీసీ నేత అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయించారని ఆరోపించారు. ఏడాది తుగ్లక్ పాలనలో జరుగుతున్న అరాచకాలను, అన్యాయాలను బయటపెట్టినందుకే అచ్చెన్నాయుడు పై జగన్ పగ పట్టారని లోకేశ్ చెప్పారు.
‘బీసీలకు జగన్ చేస్తున్న అన్యాయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించినందుకు ఆయనపై వ్యక్తిగత దూషణలకు దిగి జగన్ రాక్షస ఆనందం పొందారు. రూ.లక్ష కోట్లు కొట్టేసి 16 నెలలు ఊచలు లెక్కపెట్టిన జగన్ అందర్నీ జైలులో పెట్టాలనుకోవడం సహజమే’ అని ట్వీట్లు చేశారు.’రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉంది ఇష్టం వచ్చినట్టు ఎవరినైనా అరెస్ట్ చేస్తానని జగన్ గారు అనుకుంటున్నారని దుయ్యబట్టారు.