telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కోడెలకు .. టీడీపీలోనే అసమ్మతి సెగలు..

tdp leaders complaint on kodela to party

కోడెల శివప్రసాదరావుపై సొంతపార్టీ టీడీపీలోనే అసమ్మతి ఎగసిపడింది. కోడెల కుటుంబం గత ఐదేళ్లపాటు సాగించిన అరాచకాలపై గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ నేతలే గొంతెత్తారు. ఆయన కుటుంబం అరాచకాలపై విసిగి వేసారిపోయామని, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొత్త వ్యక్తిని నియమించాలంటూ గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే ఆందోళనకు దిగారు. ముప్పాళ్ళ మాజీ ఎంపీపీ గోగినేని కోటేశ్వరరావు, పార్టీ జిల్లా కార్యదర్శి కోమటినేని శ్రీనివాసరావు తదితరుల నాయకత్వంలో అసమ్మతి వర్గీయులు బుధవారం తొలుత సత్తెనపల్లి పట్టణంలోని పాతబస్టాండ్‌లో ఉన్న టీడీపీ కార్యాలయం వద్ద కోడెలకు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన చేపట్టారు.

గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి 200 మందికిపైగా అసమ్మతి నాయకులు, కార్యకర్తలు వెళ్లి, క్విట్‌ కోడెల.. సేవ్‌ సత్తెనపల్లి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. నూతన ఇన్‌చార్జిని నియమించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆ సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతోపాటు కోడెల శివప్రసాదరావు సైతం రాష్ట్ర కార్యాలయంలోనే ఉండడం గమనార్హం. తర్వాత చంద్రబాబు కార్యాలయం నుంచి వెళ్లిపోయే సమయంలో కాన్వాయ్‌ వద్ద అసమ్మతి నాయకులు ఆయన్ను కలవగా.. ‘నాకు అన్నీ తెలుసు. నేను చూసుకుంటా’ అంటూ వెళ్లిపోవడం విశేషం. .

Related posts