telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రాజకీయ రగడ… రామతీర్థం ఉద్రిక్తం…

విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉద్రిక్తత నెలకొంది. రాములోరి ఆలయానికి శంకుస్థాపన నేపథ్యంలో అవమానం జరిగిందని అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. దేవాలయ నిర్మాణ పనులు, పూజాకైంకర్యాలు పూర్వం నుంచి రాజవంశీయులే నిర్వహిస్తుంటే… ప్రభుత్వ అధికార యంత్రాంగం, అధికారపార్టీ నాయకులు నిబంధనలకు తిలోదకాలిచ్చారని ఆయన కోపగించుకున్నారు.

శంకుస్థాపన విషయాన్ని పాలకమండలి సమావేశంలో ప్రస్తావించకపోవడంతో ఆయన ఆక్షేపించారు. శంకుస్థాపన శిలాఫలకాన్నిఆయన నేలపాల్జేశారు. విజయనగరంజిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో రామాలయ ఆవరణలో ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తిచేశారు.

శంకుస్థాపన విషయం ధర్మకర్తల మండలితో చర్చించకుండా… శంకుస్థాపన పూజల్లో ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మంత్రులు బొత్స సత్యనారాయణ, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు రామతీర్థంచేరుకుని అధికారులను నిలదీశారు. ఆలయ మర్యాదలు పాటించరేమని ప్రశ్నించారు.

పూర్వికుల కాలంనాటినుంచి రాజవంశీయులే చేపట్టే కార్యక్రమాలను, నిబంధనలకు విరుద్ధం ప్రభుత్వం తరఫున పూజాకార్యక్రమాలు, శంకుస్థాపన పూజలు నిర్వహించడాన్ని అశోక్ గజపతిరాజు తప్పుబట్టారు. సంప్రదాయానికి విరుద్ధంగా ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించడాన్ని, మంత్రులు పూజలు అశోక్‌ గజపతిరాజు ఆక్షేపించారు. పునర్నిర్మాణ, శంకుస్థాపన ఫలకాలను ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడంపై మండిపడ్డారు. శిలాఫలకాలను ఆయన తోసేశారు.

రామతీర్థంలో ఆలయ పునర్నిర్మాణం, శంకుస్థాపన కార్యక్రమంలో అశోక్‌ గజపతిరాజు, అధికారుల వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది.

రామతీర్థం బోడికొండపై కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌ గజపతి రాజు వీరంగం సృష్టించారని మంత్రి వెల్లంపల్లి ఆరోపించారు. ప్రోటోకాల్‌ప్రకారమే శిలా ఫలకంపై పేర్లు రాయించామని చెప్పారు. ఆలయ ధర్మకర్తకు ఇవ్వాల్సిన అన్ని మర్యాదలు ఇచ్చామని వివరించారు. బోడికొండపై కోదండరాముడి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో వెల్లంపల్లి స్పందించారు.

రాముడి విగ్రహం ధ్వంసం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో వచ్చే శ్రీరామనవమికి ఆలయ నిర్మాణం పూర్తవుతుందన్నారు. రామతీర్థం ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున నాలుగు కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు అభివృద్ధి చేస్తున్నతరుణంలో రామతీర్థంలోనూ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తోందని మంత్రి వెల్లంపల్లి తెలిపారు.

దైవసంబంధమైన కార్యక్రమంలో అశోక్ గజపతిరాజులాంటి పెద్దాయన ప్రవర్తించిన తీరును మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. ఆలయ అభివృద్ధికోసం అనువంశిక ధర్మకర్తహోదాలో ప్రభుత్వానికి ఒక్క లేఖ కూడా రాయలేదన్నారు. రాచరిక వ్యవస్థలో లేమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు… శంకుస్థాపనకు పిలవడానికి వెళ్లిన ఈవో, ప్రధాన అర్చకులను తిట్టిపంపారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

రామతీర్థంలో కోదండరాముడి విగ్రహ శిరస్సును ధ్వంసం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వేడెక్కించాయి. తాజాగా ఆలయ పునర్నిర్మాణాకి ప్రభుత్వంతరఫున శంకుస్థాపన పూజలను నిర్వహించిన నేపథ్యంలో ఉద్రిక్తతకు దారితీసింది. పూజలు ముగిసిన తర్వాత అశోక్ గజపతిరాజు రాములోరిని దర్శించుకుని వెళ్లిపోయారు.

Related posts