telugu navyamedia
ఆంధ్ర వార్తలు

టీడీపీ నేత అరవింద్‌ కు కొన‌సాగుతున్న వైద్యం ..

గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం జొన్నలగడ్డలో శనివారం సాయంత్రం పోలీసుల దాడిలో అస్వస్థతకు గురైన నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్ అరవింద్ బాబుకు వైద్యం కొనసాగుతోంది. ప్ర‌స్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. అరవింద్‌ కాలర్‌ బోన్‌, రిబ్‌బోన్‌ దెబ్బతిందని వైద్యులు తెలిపినట్లు ఆయన కుటుంబీకులు వెల్లడించారు.

కాగా..ఇటీవ‌ల‌ నియోజకవర్గంలో వైఎస్ఆర్ విగ్రహంధ్వంసమైన ఘటన‌కు సంబంధించి ఇద్దరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీన్ని నిరసిస్తూ నిన్న  టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అరెస్ట్‌ చేసిన టీడీపీ కార్యకర్తలను వదిలిపెట్టాలని నిన్న నర్సరావుపేటలో జ‌రిగిన ఆందోళ‌న‌లో టీడీపీ ఇంఛార్జి చదలవాడ అరవింద్‌బాబు కూడా పాల్గొన్నారు.

అయితే ధర్నా విరమించాలని అరవింద్‌ను పోలీసులు కోరగా అరవింద్‌కు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న టీడీపీ శ్రేణులపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలోఅరవింద్ బాబు గుండెలపై పోలీసులు బూటుకాలుతో తన్నారు. బూటుకాలుతో తన్నడంతో ఆయన సృహతప్పిప‌డిపోవ‌డంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడానికి ఆయన ఇబ్బందిపడుతున్నట్లు తెలుస్తోంది.

అయితే అరవింద్‌బాబును ఆస్పత్రికి తరలించిన అంబులెన్స్‌పై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. దీంతో టీడీపీ కార్యకర్తలు ప్రతిఘటించగా… మరోసారి పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. కాగా పోలీసులు వ్యవహరించిన తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

Related posts