telugu navyamedia
ఆంధ్ర వార్తలు

టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు మృతి..

టీడీపీలో విషాదం చోటు చేసుకుంది. తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు (102) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కుమార్తె నివాసంలో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

ఎమ్మెల్యే, ఎంపీ పదవులతో పాటు మంత్రిగానూ వెంకట్రావు పనిచేశారు. రైతు నాయకుడిగానూ ఆయన సేవలందించారు. సంగం డెయిరీకి యడ్లపాటి వెంకట్రావు వ్యవస్థాపక అధ్యక్షుడు.

తెనాలి సమీపంలోని బోడపాటిలో 1919లో జన్మించారు. 1967లో గుంటూరు జిల్లా వేమూరి నుంచి యడ్లపాటి వెంకట్రావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978లో కాంగ్రెస్‌లో చేరిన యడ్లపాటి.. వేమూరి నుంచి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

1978-80 మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన పని చేశారు. 1983లో టీడీపీలో చేరిన యడ్లపాటి వెంకట్రావు రాజ్యసభ ఎంపీగా.. 1995లో గుంటూరు జడ్పీచైర్మన్‌గా పని చేశారు.

కాగా..యడ్లపాటి వెంకట్రావు మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Related posts