telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ నిర్ణయం..

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీఎల్సీ సమావేశం ముగిసింది. చంద్రబాబు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని ఈ మేరకు టీడీఎల్పీ నిర్ణయం తీసుకుంది.

అంతకుముందు సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అనే అంశంపై గత కొన్ని రోజులుగా టీడీపీలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో శనివారం మధ్యాహ్నం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన వర్చువల్‌గా సమావేశమైన టీడీపీ శాసనసభాపక్షం దీనిపై స్పష్టత ఇచ్చింది.

ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా బడ్జెట్‌ సమావేశాలకు వెళ్లాలని, చర్చలో పాల్గొనాలని మాజీ మంత్రి, సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు సూచించారు. దీంతో సీనియర్‌ నేతల సూచనల మేరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాల్సిందేనని నిర్ణయించారు.

మార్చి7, 2022వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి11న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతుండడంతో అందరి దృష్టి టీడీపీపై నెలకొంది

ఇదిలావుంటే..తన సతీమణిని అసెంబ్లీలో దూషించడంతో భోరున విలపించడమే కాకుండా తిరిగి సీఎంగానే సభకు వస్తానని, అప్పటివరకు సభలో అడుగుపెట్టనని చంద్రబాబు శపథం చేశారు.

చంద్రబాబు బాటలోనే అసెంబ్లీ వెళ్లమని మెజార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నప్పటికీ.. ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు అసెంబ్లీకి వెళ్లాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆన్ లైన్ లో టీడీఎల్పీ సమావేశం అయింది. ఆ మేరకు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు

Related posts