telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గవర్నర్‌కు చంద్రబాబు లేఖ..సరైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

chandrababu

ఆంధ్రప్రదేశ్‌ రాజధానుల విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లులను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు పంపించింది. ఈ నేపథ్యంలో ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు విభజన చట్టానికి వ్యతిరేకమని తెలిపారు.

2014లో తీసుకొచ్చిన విభజన చట్టం ఆధారంగా ఏపీ రాజధాని అమరావతియేనని ఆయన అన్నారు. రాజధానిని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. ఆ కమిటీ సిఫార్సుల మేరకే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని వివరించారు. ఇప్పుడు ఆ బిల్లును కాదని అమరావతి ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు వైసీపీ సర్కారు ప్రయత్నిస్తోందని చంద్రబాబు తెలిపారు.

అమరావతి శిథిలాలపై మూడు రాజధానులు కట్టేందుకు ఈ బిల్లులు తెచ్చారని చంద్రబాబు చెప్పారు. శాసన మండలి ఈ బిల్లులను తిరస్కరించలేదని తెలిపారు. ఈ బిల్లులను మండలి సెలెక్ట్‌ కమిటీకి పంపాలని సూచించిందని వివరించారు. రాజధాని తరలింపు అంశాలు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని ఆ లేఖలో ప్రస్తావించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సరైన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Related posts