ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజూ వాడివేడిగా కొనసాగుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పంటలకు గిట్టుబాటు ధరపై చర్చించాలని పట్టుబట్టిన టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఇది పార్టీ ఆఫీసు కాదని మందలించారు. చంద్రబాబు కల్పించుకోవడంతో స్పీకర్, చంద్రబాబు మధ్య కాసేపు వాగ్వివాదం జరిగింది. చంద్రబాబుపైనా స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీడీపీ సభ్యులు మండిపడ్డారు. స్పీకర్ తీరుకు నిరసనగా సభ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు.
అనంతరం టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్ తమ్మినేని సీతారాం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర అందడం లేదని, ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ చేస్తామన్న సీఎం మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు.