telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ గూటికి బొండా ఉమ..?: రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం!

MLA Bonda Uma fire to Avanti

గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్న టీడీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ఇక టీడీపీలో ఉండకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఆయన ఈనెల 5న విజయవాడ రాబోతున్నారని వచ్చిన వెంటనే వైసీపీ గూటికి చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసిన బొండా ఉమామహేశ్వరరావు వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో స్వల్ప ఓట్లతో పరాజయం పాలయ్యారు. గతంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

మల్లాది విష్ణు ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనను అక్కడి నుంచి పార్టీ తప్పించలేని పరిస్థితి. ఇకపోతే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉన్నప్పటికీ బలమైన అభ్యర్థి లేరని పార్టీలో ప్రచారం జరుగుతుంది. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను ఢీ కొట్టాలంటే బొప్పన భవకుమార్ వల్ల సాధ్యం కాదని కొందరు వైసీపీ నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది. గద్దె రామ్మోహన్ రావుకు చెక్ పెట్టాలంటే బొండా ఉమామహేశ్వరరావు లాంటి నేతలతో అయితే చెక్ పెట్టొచ్చని వైసీపీ భావిస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

మరో వైపు విజయవాడ తూర్పు నియోజకవర్గం బాధ్యతలు తీసుకునేందుకు బొండా ఉమామహేశ్వరరావు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ క్యాడర్ సహకరించే అవకాశం లేదని బొండా భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి బొప్పన భవకుమార్ వైసీపీ అభ్యర్థిగా పోటీచేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మెహన్ రావు చేతిలో పరాజయం పాలయ్యారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పాగా వేయాలని భావిస్తున్న వైసీపీ బొండా ఉమామహేశ్వరరావు పార్టీలో చేరితే ఆయనను అక్కడ నుంచే రంగంలోకి దింపాలని పార్టీ హైకమాండ్ ఆలోచిస్తునట్టు తెలుస్తోంది.

Related posts