రాష్ట్రానికే తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వందశాతం మేర ప్రైవేటీకరణ చేస్తామని ఇప్పటికే కేంద్రం ప్రకటించగా.. ఈ క్రమంలోనే విక్రయించే దిశగా మరో కీలక ముందడుగు పడినట్టు కనిపిస్తోంది. టాటా స్టీల్ ఆసక్తిగా ఉందని, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అమ్మకం విషయంలో క్లారిటీగా ఉన్న కేంద్రం.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఏ క్షణానైనా అమ్మేందుకు సిద్ధంగా ఉంది.
అయిదు దశాబ్దాలకు పైగా కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటూ వస్తోన్న ఉక్కు కర్మాగారం ఇది . ప్రతీ ఏడాదికి 7.3 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ దేశంలో ఏర్పాటైన మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో దశాబ్దాల కిందటే రాష్ట్రంలో ఉద్యమాలు చేసి సాధించుకున్న ఈ ప్లాంట్‌ను ప్రైవేటు సంస్థలకు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది.
నేపథ్యంలో- వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మరో తాజా సమాచారం వెలువడింది.విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కొనుగోలు చేయడానికి టాటా స్టీల్ ఆసక్తి కనపరుస్తోంది. విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నామంటూ టాటా స్టీల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, మేనేజింగ్ డైరెక్టర్ టీవీ నరేంద్రన్ తెలిపారు.
అంతే కాకుండా 22 వేల ఎకరాల్లో విస్తరించి విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సమీపంలోనే గంగవరం ఓడరేవు ఉండటం ఓ అడ్వాంటేజ్. ఉక్కును ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడిసరుకులను తెప్పించుకోవడం సులభతరమౌతుంది. అదే సమయంలో ఇక్కడ తయారైన స్టీల్‌ను ఎగుమతి చేయడానికీ ఈ పోర్ట్ ఉపయోగపడుతుందనే అభిప్రాయాన్ని టీవీ నరేంద్రన్ వ్యక్తం చేశారు.