telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఈ నెల 21న మునుగోడు బ‌హిరంగ స‌భ‌: ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు

*మునుగోడులో ఈ నెల 21 బీజేపీ భారీ బ‌హిరంగ స‌భ‌
*బీజేపీ బహిరంగ సభలో పాల్గొన‌నున్న‌ కేంద్ర హోం మంత్రి అమిత్ షా
*21న బీజేపీ బ‌హిరంగ స‌భ‌లో రాజగోపాల్ రెడ్డితో పాటు భారీ చేరిక‌లు
*సీఎం కేసీఆర్‌కు అధికారాన్ని కోల్పోతున్నామ‌న్న‌ భయం పట్టుకుంది..
*తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తుందని బీజేపీ ఇన్‌ఛార్జ్‌ తరుణ్ చుగ్  ఆరోపించారు. కేసీఆర్‌ కు రాజ్యాంగంపై నమ్మకం లేదన్నారు. ప్రజా ఆందోళనలు ఆపే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.

గత రెండు రోజులుగా ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అన్నారు. బండి సంజయ్ పాదయాత్ర సజావుగా సాగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

ఈ నెల 21న మునుగోడులో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ ప్రారంభం అవుతుంద‌ని అన్నారు. ఆ  సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొంటారని తరుణ్ చుగ్ చెప్పారు. 

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు సభలో కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై ఏ విధంగా పోరాడాలనేది పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం చేస్తారని అన్నారు. అదే సభలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు.

ఇంకా ఇతర పార్టీలకు చెందిన చాలా మంది ప్రముఖులు బీజేపీలో చేరనున్నారని ప్రకటించారు. ప్రధాని పంద్రాగస్టు ప్రసంగంలో పసలేదన్న కేసీఆర్ వ్యాఖ్యలను తరుణ్ చుగ్ తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ సాయంత్రం చేసే ప్రసంగాలపై ఎక్కువ స్పందించడం అనవసరమన్నారు.

దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలతో కేసీఆర్‌కు బుద్ధి చెప్పామన్న తరుణ్.. మునుగోడూలోనూ విజయపరంపర సాగిస్తామని స్పష్టం చేశారు. మునుగోడు ఉపఎన్నిక ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుందని చెప్పారు.

మునుగోడులో ప్రజల ఆశీర్వాదం బీజేపీకే ఉంటుందన్నారు. తెలంగాణకు అవినీతి, వంశ పారపర్యంగా వచ్చే రాజకీయాలే శత్రువులని అన్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పాపాల నుంచి త్వరలో విముక్తి లభిస్తుందన్నారు.

కేసీఆర్‌కు అధికారం కోల్పోతామనే భయం పట్టుకుందని అన్నారు. ఆంగ్లేయులు, ఇందిరాగాంధీ లాగానే కేసీఆర్ పాలన ఉందని… త్వరలో ప్రజలు ముంగింపు పలుకుతారని తెలిపారు.

Related posts