వ్యాక్సిన్ తోనే శాశ్వత రక్షణ ఉంటుందని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కోవిడ్ పోరాటంలో వ్యాక్సిన్ శాశ్వత రక్షణ కవచంగా ఉపయోగపడుతుందన్నారు. వ్యాక్సిన్ తయారీదారులు అన్ని రకాల చర్యలతో ఉత్పత్తిని వేగవంతం చేయాలని గవర్నర్ సూచించారు. గవర్నర్ ఈ రోజు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కు సంబంధించిన ప్రతినిధులతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నుండి వస్తున్న స్పుత్నిక్ వి వ్యాక్సిన్ దిగుమతి, మన దేశంలో తయారీ, పంపిణీ ఇలాంటి పలు అంశాలను చర్చించారు. డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ నుండి డిఆర్ డిఓ సంయుక్త భాగస్వామ్యంతో 2 డీజి ఔషధం రావడం, ఇది సంపూర్ణ దేశీయ ముడిసరుకుతో తయారు చేయడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆత్మ నిర్బర్ భారత్ ఆశయానికి అనుగుణంగా ఉందని గవర్నర్ ప్రశంసించారు. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ప్రతినిధులు తాము ఈ జూలై నెల ఆఖరి వరకు దాదాపు రెండు కోట్ల స్పుత్నిక్ వి వ్యాక్సిన్ డోసులు దిగుమతి చేసుకుంటామని గవర్నర్ కు తెలిపారు. అలాగే ఈ సంవత్సరం ఆఖరి వరకు దిగుమతుల ద్వారా, మన దేశంలోనే తయారీ ద్వారా దాదాపు 15 నుండి 20 కోట్ల వరకు వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి తెస్తామని గవర్నర్ కు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ నుండి కపిల్, మల్లికార్జున రావు, వేమూరి విశ్వనాధ్, రవి తదితరులు పాల్గొని వివిధ అంశాలను డాక్టర్ తమిళిసై కి వివరించారు. చిన్న పిల్లలకు అవసరమైన వ్యాక్సిన్ ప్రయోగాలు త్వరితగతిన విజయవంతం చేసి కోవిడ్ బారి నుండి వారిని కాపాడవలసిన ఆవశ్యకత ఉందని గవర్నర్ వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ గారి భర్త ప్రముఖ నెఫ్రాలజిస్టు డా. పి. సౌందరరాజన్, గవర్నర్ గారి సెక్రటరీ కె. సురేంద్రమోహన్ పాల్గొన్నారు.
previous post