telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

నాట్యం చేస్తున్న .. రోబో శివుడు.. మీరు చూడండి..!!..

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలు కిక్కిరిశాయి. శివ నామస్మరణలతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. సోమవారం కూడా కలిసి రావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేశం లోని ప్రముఖ శైవక్షేత్రాలలో కూడా నేడు విశేష పూజలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళ శివభక్తులు తమ భక్తిని ఇలా చాటుకున్నారో చూడండి. వీలైతే ప్రశంసించండి.

మహాశివరాత్రి సందర్భంగా ఒక్కసారి శివుని తలచుకుందామా..!
“శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుర్విర్ణోశ్చ హృదయం శివః”
(శివుని రూపమే విష్ణువు. విష్ణువు రూపమే శివుడు. శివుడి గుండెల్లో కొలువైనది విష్ణువే. విష్ణువు హృదయమే శివుడి ఆవాసం… అన్న అర్థాన్ని చాటే ఈ శ్లోకం యజుర్వేదంలోనిది.)

నేడు అత్యంత ప్రముఖంగా పూజాదికాలు జరిగే పంచారామాలుగా మనం పిలిచే ఆ ఐదు క్షేత్రాల్లోనూ కొలువున్నది శివుడే. క్షేత్రపాలకుడు విష్ణువు. పైగా ఆ శివలింగాలన్నీ ఒకే లింగం నుంచి ఉద్భవించినవే. తారకాసురుడు పరమశివభక్తుడు. తపస్సు చేసి శివుడి ప్రాణలింగాన్ని వరంగా పొందిన గర్వంతో దేవలోకంపైకి దండెత్తి, ఇంద్రుణ్ణి ఓడిస్తాడు. దాంతో దేవతలంతా తారకాసురుణ్ణి సంహరించమని ఆ శ్రీమహావిష్ణువుని కోరగా, ఆ శ్రీహరి ‘తారకుడు శివభక్తుడు. శివుడి ప్రాణలింగాన్ని పొందినవాడు. నేను వధించలేను. శివుణ్నే ఆశ్రయించండి’ అని చెప్పాడు. అప్పుడు దేవతలు శివుణ్ణి శరణు కోరగా ‘నా ప్రియభక్తుడైన తారకుణ్ణి నేను చంపలేను. మిమ్మల్నీ కాదనలేను. కుమారస్వామి వధిస్తాడు’ అని చెబుతాడు.

అంతట ఆ షణ్ముకుడు దేవసేనకు సారధ్యం వహించి తారకుడితో యుద్ధం చేశాడు. శక్తి ఆయుధంతో ఎన్నిసార్లు ఆ అసురుడి శరీరాన్ని ముక్కలుగా చేసినా మళ్లీ అతుక్కుపోతున్నాయి. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న కుమారస్వామికి శివుడు ప్రత్యక్షమై, ‘కుమారా ఆందోళన చెందకు. తారకుడి కంఠంలో నా ప్రాణలింగం ఉన్నంతవరకూ అతను చనిపోడు. దాన్ని ముక్కలుచేయాలి’ అని చెబుతాడు. అప్పుడు కుమారస్వామి ఆగ్నేయాస్త్రంతో ఆ లింగాన్ని ఐదు ముక్కలు చేయగా అవి కృష్ణా, గోదావరీ తీరాల్లో పడ్డాయి. ఓంకార నాదంతో అవి మళ్లీ ఏకమవబోతుండగా విష్ణుమూర్తి ఆదేశం మేరకు పడ్డ చోటే ఆ లింగ శకలాలను దేవతలు వెంటనే ప్రతిష్ఠించి ఆలయాలు నిర్మించారన్నది పౌరాణిక కథనం. అవే ద్రాక్షారామం, అమరారామం, క్షీరారామం, సోమారామం, కుమారారామాలు.

Related posts