ఏడవ తరగతి చదివిన ఓ యువకుడు తాను ఎస్సైనని అందరినీ నమ్మించాడు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు చెప్పి అమైందకరైలో నకిలీ కాల్ సెంటర్ తెరిచాడు. అందులో పనిచేస్తున్న యువతులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా ఏడుగురిని పెళ్లాడిన ఆ నకిలీ ఎస్సైకి చెన్నై పోలీసులు తగిన శాస్తి చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. తిరుప్పూరు జిల్లా నొచ్చిపాళైయంకు చెందిన రాజేశ్ పృథ్వీ (29) ఎస్సైనని అందరినీ నమ్మించాడు. అతడి ఆఫీసులో పనిచేస్తున్న ఎగ్మూరుకు చెందిన యువతిని అపహరించి తీసుకెళ్లి ఏడో పెళ్లి చేసుకున్నాడు.
ఆఫీసుకు వెళ్లిన కుమార్తె తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు అమ్మాయిని కిడ్నాప్ చేసింది ఆమె పనిచేస్తున్న సంస్థ ఎండీ పృథ్వీనేనని తేలింది. దీంతో అతడి సొంతూరు నొచ్చిపాళైయం వెళ్లిన పోలీసులు అక్కడ బందీగా ఉన్న యువతిని రక్షించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.