telugu navyamedia
సినిమా వార్తలు

పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్‌పై తమిళనాడు అసెంబ్లీలో చర్చ

తమిళనాడు సిఎం స్టాలిన్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారుతోంది. స్టాలిన్‌ను ప్రశంసిస్తూ పవర్ స్టార్ ట్వీట్ చేశారు. తెలుగులో చేసిన ట్వీట్‌ను తమిళనాడు అసెంబ్లీలో ఆరోగ్య శాఖామంత్రి సుబ్రమణ్యన్ చదివి వినిపించారు.

అసెంబ్లీలో ఒకవైపు తెలుగులో చదువుతూ తమిళంలో ట్రాన్స్‌లేషన్ చేస్తూ సభలోని సభ్యులకు వివరించారు. దీంతో ఒక్కసారిగా అసెంబ్లీ సభ్యుల చప్పట్లతో మారుమ్రోగింది. రాజకీయాలు చేయాలి కానీ అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం కాదు. స్టాలిన్‌ను చూసి నేర్చుకోండి అంటూ కొంతమందిని ఉద్దేశించి పవన్ చేసిన ట్వీట్ చర్చకు దారితీస్తోంది.

తమిళనాడు సీఎం స్టాలిన్‌ను అభినందిస్తూ పవన్ కల్యాణ్ ఇటీవల ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ”ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయం చేయాలి కానీ అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, ప్రభుత్వ పనితీరు మీ ఒక్క రాష్ట్రానికే కాకుండా దేశంలోని రాష్ట్రాలకు, అన్ని పార్టీలకు మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా”నంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చెన్నైలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి స్టాలిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. స్టాలిన్‌ను కలవడం చాలా సంతోషంగా ఉందని, ఆయన తీసుకున్న పలు ఉన్నతమైన నిర్ణయాలతో ఆయన ఓ గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదిగారంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. కరోనా కాలంలో మెరుగైన పాలన అందిస్తున్నారంటూ ఆయనకు అభినందనలు తెలిపారు.

Related posts