telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సొంతింటికే కన్నం… ప్రియుడితో కలిసి నటి నిర్వాకం

Actress

కరోనా వల్ల ఓ తమిళ నటి దొంగగా మారింది. ప్రియుడితో కలిసి అతడి ఇంట్లోనే దొంగతనానికి పాల్పడి అడ్డంగా బుక్కైంది. కడలూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన తమిళ బుల్లితెర ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. తమిళనాడుకు చెందిన సుచిత్రా అనే యువతి అనేక టీవీ సీరియళ్లలో నటించింది. దేవత అనే సీరియల్‌ ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టింది. డ్రైవర్‌గా పనిచేస్తున్న మణికందన్ అనే వ్యక్తితో కొంతకాలం క్రితం పరిచయం ఏర్పడింది. అతడికి వివాహమైందని తెలిసి కూడా సుచిత్ర సహజీవనం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్ కారణంగా షూటింగులు ఆగిపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. మణికందన్ ఇంట్లో భారీగా బంగారు ఆభరణాలు, నగదు ఉందని తెలుసుకుని చోరీకి ప్లాన్ వేసింది. ప్రియురాలి కోసం మణికందన్‌ కూడా తన ఇంట్లోనే దొంగతనం చేసేందుకు ఒప్పుకున్నాడు. సుచిత్ర ప్లాన్ ప్రకారం మణికందన్ కడలూరు జిల్లా పన్రుతిలో తన స్వగ్రామానికి చేరుకున్నారు‌. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న 18 సవర్ల బంగారంతో పాటు రూ.50 వేల నగదు దొంగిలించాడు. ఇంట్లో డబ్బు, బంగారం కనిపించకపోవడంతో మణికందన్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇది ఇంటి దొంగ పనేనని తేల్చి మణికందన్‌ను అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న సుచిత్ర పరారైంది. దీంతో పోలీసులు ఆ నటి కోసం గాలిస్తున్నారు.

Related posts