ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్న అన్నపూర్ణ పథకం దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ నగరంలో అన్నపూర్ణ భోజన పథకాన్ని ప్రవేశపెట్టి ఆరు సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా అమీర్‌పేట్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, అన్నపూర్ణ పథకాన్ని రూపొందించిన సోమేశ్ కుమార్‌ను, నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్న హరే కృష్ణ ఫౌండేషన్ లను అభినందిస్తున్నట్టు చెప్పారు.
సోమేశ్ కుమార్ గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న సమయంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారని, 2014 మార్చి 1న నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ప్రారంభించారని గుర్తుచేసుకున్నారు.అప్పుడు 8 కేంద్రాలతో రోజుకు 2,500 మందికి ఈ పథకం ద్వారా భోజనం అందించామని అన్నారు. ఈ పథకాన్ని దశలవారీగా నగరంలో 150 కేంద్రాలకు విస్తరించడం ద్వారా ప్రతిరోజు 30,000 నుండి 35,000 మంది ఆకలిని తీరుస్తోందని వివరించారు.