telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత్-ఇంగ్లాండ్ సిరీస్ పై సెటైర్లు వేసిన మైకేల్‌ వాన్‌…

భారత పర్యటనకు ఇంగ్లాండ్ జట్టు వచ్చిన క్షణం నుండి ఇంగ్లీష్ మాజీ కెప్టెన్ మైకేల్‌ వాన్‌ ఏదో ఒక్క కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈరెండు జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీసులో టాస్‌ కీలకం అవుతుండటంపై ఇంగ్లీష్ మాజీ కెప్టెన్ మైకేల్‌ వాన్‌ సెటైర్లు వేశాడు. ఐదు టీ20 సిరీస్‌లో ఇప్పటి వరకు మూడు మ్యాచులు జరిగాయి. తొలి మ్యాచులో ఇంగ్లండ్ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ పేలవంగా ఆడింది. తక్కువ స్కోరే చేయడంతో మోర్గాన్‌ సేన విజయం సాధించింది. రెండో టీ20లో విరాట్ కోహ్లీ టాస్‌ గెలిచాడు. తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకొని మోర్గాన్ సేనను దెబ్బకొట్టాడు. ఆపై హాఫ్ సెంచరీతో జట్టును గెలుపు బాట పట్టించాడు. ఇక మంగళవారం జరిగిన మూడో టీ20లోనూ ఇదే పునరావృతమైంది. టాస్‌ గెలిచిన ఇయాన్ మోర్గాన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకొని కోహ్లీసేనను మోస్తరు స్కోరుకే పరిమితం చేశాడు. దాంతో ఇంగ్లండ్ 2-1తో సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక దీని పై మైకేల్ వాన్‌ ట్వీట్‌ చేశాడు. ‘చూస్తుంటే భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో అత్యుత్తమ టాసర్‌ విజేతగా నిలుస్తాడేమో అనిపిస్తోంది’ అని పేర్కొన్నాడు. అయితే తమ ఓటములకు టాస్‌ను నిందించబోమని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.

Related posts