telugu navyamedia
సినిమా వార్తలు

భారీ రేటుకు అమ్ముడైన “సైరా” హక్కులు

syeraa

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్‌ను ఆగస్ట్ 20న విడుదల చేశారు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ సినిమా నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదల కానుంది. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం సెప్టెంబ‌ర్ 15న సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను క‌ర్నూలులో నిర్వ‌హించ‌బోతున్నార‌ని స‌మాచారం. కాగా… `సైరా న‌ర‌సింహారెడ్డి` విష‌యంలో భారీ పోటీ నెల‌కొంది. దీంతో నిర్మాత‌లు ఫ్యాన్సీ రేటు రెండు రాష్ట్రాల థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను అమ్మార‌ని ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు సీడెడ్‌లో రూ.22 కోట్లు, ఉత్త‌రాంధ్ర రూ.14.4 కోట్లు, తూర్పు గోదావ‌రి రూ.10.5కోట్లు, ప‌శ్శిమ గోదావ‌రి రూ.8.4కోట్లు, కృష్ణా రూ.8.4 కోట్లు, గుంటూరు రూ.11.5కోట్లు, నెల్లూరు రూ.4.8కోట్లు, నైజాం రూ.30కోట్ల రూపాల‌కు థియేట్రిక‌ల్ హ‌క్కులు అమ్ముడ‌య్యాయ‌ట‌. అంటే మొత్తంగా రెండు రాష్ట్రాల్లో రూ.110 కోట్ల బిజినెస్ జ‌రిగింద‌ని టాక్‌. బాహుబ‌లి మిన‌హా రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్య‌ధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రుపుకున్న చిత్రం “సైరా న‌ర‌సింహారెడ్డి” అని తెలుస్తోంది.

Related posts