telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రోమాలు నిక్కబొడుచుకునేలా “సైరా” టీజర్

Sye-Raa

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్‌ను చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22) సందర్భంగా రెండు రోజుల ముందుగానే… మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సైరా’ టీజర్ ను ఈరోజు విడుదల చేశారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ వాయిస్‌తో తెలుగోడి రోమాలు నిక్కబొడుచుకునేలా టీజర్‌ను రూపొందించారు. “చరిత్ర స్మరించుకుంటుంది. ఝాన్సీ లక్ష్మీభాయ్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణత్యాగాలను. కానీ, ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు. ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధభేరి మోగించిన రేనాటి సూర్యుడు…” అంటూ పవన్ కల్యాణ్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమయ్యే ‘సైరా’ టీజర్ “సింహంలాంటోడు దొరా.. అతడే వాళ్ల ధైర్యం దొరా..’ అంటూ నరసింహారెడ్డి ధీరత్వం గురించి వర్ణించే డైలాగ్ ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ‘వేలాది వీరులారా.. చరిత్రలో మనం ఉండకపోవచ్చు. కానీ, చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి’ అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్ టీజర్‌కు హైలెట్‌గా నిలుస్తోంది. ‘సైరా నరసింహారెడ్డి’ అంటూ గంభీరమైన వాయిస్‌తో పవన్ కల్యాణ్ చెప్పే డైలాగ్‌తో ముగిసింది. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

Related posts