స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రం “సైరా నరసింహారెడ్డి”. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించారు. తన కలల ప్రాజెక్ట్ “సైరా”ను తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా పట్టాలెక్కించాడు చిరు. ఈ సినిమా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో రూపొందించారు. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలలో విడుదల చేశారు. చరిత్ర గుర్తించని వీరుడి కథ అంటూ అక్టోబర్ 2 మహాత్మగాంధీ జయంతి రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా డైరక్షన్, మెగాస్టార్ చిరంజీవి నటన, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్ని సినిమాను కాపాడాయని చెప్పొచ్చు. అయితే అసలు కథకు మసాలా కోటింగ్ ఎక్కువైందన్న టాక్ నడుస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం విడుదలైన రోజే మాట్నీ షో కంటే ముందే తమిళ్ రాకర్స్ చేతిలో పైరసీకి గురైంది. దీనిపై చిత్ర దర్శక నిర్మాతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చక్కర్లు కొడుతున్న పైరసీ లింకులతో మెగా అభిమానులు ఆయా ప్రాంతాల్లోని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. సైరా చిత్రాన్ని థియేటర్లలోనే చూడాలని అభిమానులకు విజ్ఞప్తి చేస్తోంది మూవీ యూనిట్. థియేటర్లలో వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయకూడని కోరింది. ఇక పైరసీ లింకులు కనిపిస్తే [email protected]కి పంపించాలని సూచించింది.