telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సైరా” ట్రైలర్ పై అమీర్ ప్రశంసల వర్షం

Syeraa

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్‌ను ఆగస్ట్ 20న విడుదల చేశారు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ సినిమా నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదల కానుంది. బుధవారం విడుదలైన చిత్ర ట్రైలర్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రేక్ష‌కులే కాక సినీ సెలబ్రిటీలు కూడా ట్రైల‌ర్‌పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. తాజాగా మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చిత్ర బృందంపై ప్ర‌శంస‌లు కురిపించారు. “సైరా చిత్రం భారీ స్కేల్ మూవీ. చిరంజీవి గారికి నేను పెద్ద అభిమానిని. సినిమా చూసేందుకు చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను. చిరంజీవి స‌ర్‌, రామ్ చ‌ర‌ణ్‌,చిత్ర బృందానికి నా శుభాకాంక్ష‌లు” అని త‌న పోస్ట్‌లో తెలిపారు అమీర్.

Related posts