పగటిపూట ఎండలు తగ్గుముఖం పట్టడం, సాయంత్రం చిరుజల్లులకు తోడు చలిగాలులు వీస్తుండటంతో స్వైన్‌ఫ్లూ వైరస్ వ్యాపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 1227 స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదు కాగా, కేవలం రెండు వారాల్లోనే పదిహేను స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే గత ఏడాది 1007 కేసులు నమోదు కాగా, వీరిలో 28 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఏడాది ఇప్పటికే 20 మంది మృతి చెందినట్లు అధికారుల గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలతో పోలిస్తే గ్రేటర్ పరిసర ప్రాంతాల్లోనే ఫ్లూ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు.
చాప కింది నీరులా విస్తరిస్తున్న ఈ స్వైన్‌ఫ్లూపై మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కేవలం గ్రేటర్‌లోనే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిల్లాలోనూ చాప కింది నీరులా విస్తరిస్తుండటంతో సామాన్య జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ తమను ఆ వైరస్ వెంటాడుతుందోనని ఆందోళన చెందుతున్నాయి. కేవలం గ్రేటర్‌లో నమోదైన కేసులే కాకుండా జిల్లాల్లో నమోదైన కేసులు సైతం నగరంలోని ఆస్పత్రులకు తరలిస్తుండటంతో హెచ్1ఎన్1 వైరస్ ఎక్కడ తమకు చుట్టు కుంటుందోనని భయపడుతున్నారు.