ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర సీఎస్, డీజీపీల నుంచి వివరణ అందుకున్న ఈసీ… పోలింగ్ రోజు, అనంతర హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో ఈసీ కఠిన చర్యలు తీసుకుంది. పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలపై బదిలీ వేటు వేసింది.
పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెండ్ చేసింది. అదే సమయంలో, తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణలపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది.
పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లోని 12 మంది సబార్డినేట్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు ఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ప్రతి కేసుపై సిట్ వేసి రెండ్రోజుల్లో నివేదిక అందించాలని తన ఆదేశాల్లో పేర్కొంది.
హింసాత్మక ఘటనలు జరిగిన చోట 25 కంపెనీల సాయుధ బలగాలను కొనసాగించాలని కేంద్ర హోంశాఖకు నిర్దేశించింది.
లెక్కింపు పూర్తయిన 15 రోజుల తర్వాత కూడా బలగాలు కొనసాగించాలని ఎన్నికల సంఘం తన ఆదేశాల్లో వివరించింది.