telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ ఆత్మహత్య కేసు… కీలక విషయాలు వెల్లడించిన ముంబై పోలీసులు

Sushanth singh rajput

జూన్ 14న సుశాంత్ తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. పలువురు బాలీవుడ్ ప్రముఖుల్ని ఇప్పటికే విచారించారు. అటు బీహార్ పోలీసులకు కూడా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిపై అతని తండ్రి ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ భీర్ సింగ్ ఇవాళ ప్రెస్‌ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక విషయాలను బయటపెట్టారు. సుశాంత్‌‌కు, తన మాజీ మేనేజర్‌ దిషాకు సంబంధం ఉన్నట్లు వచ్చిన వార్తల పట్ల తీవ్ర మనస్తాపం చెందాడని చెప్పారు. అలా వస్తున్న వార్తల గురించి సుశాంత్ గూగుల్‌లో వెతికాడని తెలిపారు. అంతేకాదు, నొప్పి తెలియకుండా ఎలా చనిపోవాలన్న దాని గురించి కూడా సుశాంత్ గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు ముంబై పోలీస్ కమిషనర్ చెప్పారు. తన పేరును కూడా సెర్చ్ చేసి తనపై వస్తున్న వార్తల గురించి వెతికాడని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రెండు గంటల ముందు సుశాంత్ తన పేరును గూగుల్‌లో వెతికాడని చెప్పారు. ఇదిలా ఉండగా.. సుశాంత్ చనిపోవడానికి సరిగ్గా 5 రోజుల ముందే దిషా చనిపోయింది. దీంతో ఆమె చనిపోవడం పట్ల సుశాంత్ ఆత్మహత్య అనంతరం పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. దిషా తన కాబోయే భర్త నివాసంలో జరిగిన పార్టీలో పాల్గొంది. వేకువ జామున 3 గంటలకు ఆమె ఆత్మహత్య చేసుకుందని, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గుర్తించినట్లు ముంబై పోలీస్ కమిషనర్ చెప్పారు. ఆమెతో కలిపి మొత్తం ఐదుగురు ఈ పార్టీలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. అయితే సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్య అంటూ పలు వీడియోలు నెట్టింట్లో హల్చల్ చేస్తుండగా… మరోవైపు ముంబై పోలీసులు అతనిది ఆత్మహత్యేనని చెప్పడంపై సుశాంత్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. 

Related posts