telugu navyamedia
క్రీడలు వార్తలు

నన్ను స్లెడ్జ్ చేస్తే సంతోషంగా ఫీలయ్యా : సూర్యకుమార్

గతేడాది ఐపీఎల్ సందర్భంగా మైదానంలో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. క్రీజులో కుదురుకున్న సూర్యకుమార్ యాదవ్ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రయత్నించడం.. దీనికి ఈ ముంబై బ్యాట్స్‌మన్ కళ్లతోనే బదులివ్వడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేసింది. యువ ఆటగాడి పట్ల విరాట్ కోహ్లీ ప్రవర్తించిన తీరుపై కూడా విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన లైవ్ చాట్‌లో ఈ ఘటనపై సూర్య స్పందించాడు. కోహ్లీ స్లెడ్జింగ్‌ను తాను ఆస్వాదించానని చెప్పుకొచ్చాడు. ‘సహజంగానే విరాట్ కోహ్లీ మైదానంలో చాలా ఉత్సాహంగా ఉంటాడు. నాతోనే కాకుండా ఏ ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్‌తోనైనా ఇలానే దూకుడుగా ప్రవర్తిస్తాడు. నిజానికి విరాట్ స్లెడ్జ్ చేసినందుకు సంతోషంగా ఫీలయ్యా. ఎందుకంటే… నేను బాగా ఆడితే మ్యాచ్‌ గెలుస్తామని భావించే అతను నా పట్ల అలా స్లెడ్జింగ్‌కు దిగాడు. నా వికెట్‌ తీయాలని, తద్వారా గెలుపొందాలనేది అతని వ్యూహం. అంటే, నా బ్యాటింగ్‌ వల్ల వారికి ప్రమాదం పొంచి ఉందనే అర్థం కదా. అయితే ఇదంతా ఆట వరకే. నిజానికి కోహ్లీ అంటే నాకు చాలా గౌరవం ఉంది. ఆ ఘటన తర్వాత, మైదానం వెలుపల తను నాతో ఎంతో నార్మల్‌గా ఉన్నాడు. బాగా ఆడావని మెచ్చుకున్నాడు. ఆ రోజు నా వికెట్ తీయాలనే అలా ప్రవర్తించాడు. అయితే ఇలా ఘటనల పట్ల నేను పెద్దగా రియాక్ట్ అవ్వను. మాములుగానే నేను మైదానంలో చాలా ప్రశాంతంగా ఉంటాను. ప్రత్యర్థుల కవ్వింపులను అస్సలు పట్టించుకోను. ఆ క్రమంలోనే ఆ రోజు కూడా నా పనిని నేను చేశాను’అని సూర్య చెప్పుకొచ్చాడు.

Related posts