telugu navyamedia
క్రీడలు వార్తలు

రోహిత్ కారణంగానే నా ఆటలో ఆ మార్పు వచ్చింది…

ఐపీఎల్ లో ప్రతి సీజన్ మాదిరిగానే ఈ 13 వ సీజన్ లో కూడా ముంబై ఇండియన్స్‌ వరుస విజయాలతో దూసుకపోతుంది. అయితే ఈ ఏడాది సూర్యకుమార్‌ యాదవ్‌.. ముంబై ఇండియన్స్‌లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. సూర్యకుమార్‌ దేశవాలి క్రికెట్‌లో మెరుగ్గా రాణించినా అనామక ఆటగాడిగానే ఐపీఎల్‌కు పరిచయమయ్యాడు. అతని ఐపీఎల్‌ కెరీర్‌ తొలుత ముంబై ఇండియన్స్‌తోనే మొదలైంది. 2012లో ముంబై ఇండియన్స్‌ సూర్యకుమార్‌ను కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2014లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో సూర్యకుమార్‌ యాదవ్‌ను కేకేఆర్‌ కొనుగోలు చేసింది. కేకేఆర్‌ వెళ్లిన తర్వాత ఒక్కసారిగా అతని ఆటస్వరూపం మారిపోయింది. ఆ తర్వాత కేకేఆర్‌కు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్‌ పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2018లో జరిగిన వేలంలో సూర్యకుమార్‌ను రూ. 3.2 కోట్లతో మళ్లీ ముంబై ఇండియన్స్‌ కొనుగోలుచేసింది.

ఆ తర్వాత నుండి వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ముంబైకి ఆడుతున్న సూర్యకుమార్‌ జట్టులో కీలకంగా మారాడు. ఓపెనర్ల తర్వాత వన్‌డౌన్‌లో వస్తూ సూర్యకు​మార్‌ యాదవ్‌ స్థిరంగా పరుగులు సాధిస్తున్నాడు. కాగా ఐపీఎల్‌ 13వ సీజన్‌లో మంచి ప్రదర్శన ఇస్తున్న సూర్యకుమార్‌ రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 79 పరుగులు చేసి మ్యాన్‌ ఆప్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా సూర్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ… లోయర్‌ ఆర్డర్‌లో వచ్చే ఆటగాళ్లపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే ముంబై జట్టులోకి వచ్చిన తర్వాత రోహిత్‌ నన్ను నమ్మి టాప్‌ఆర్డర్‌లో బ్యాటింగ్‌ అవకాశం ఇచ్చాడు. అందుకే నా ఆటతీరు లో గణనీయంగా మార్పు చోటుచేసుకుంది. అతను చెప్పే విషయాలను శ్రద్దగా వింటూ దానిని మ్యాచ్‌లో ఉపయోగించి పరుగులు సాధిస్తా.. అందుకే రోహిత్‌ను నేను గుడ్డిగా నమ్ముతా అని తెలిపాడు.

Related posts