ఈ నెల 31న దక్షిణాది హీరో సూర్య నటించిన చిత్రం ‘ఎన్జీకే’ విడుదల కానుంది. చిత్ర ప్రచారంలో భాగంగా హైదరాబాద్ కు సూర్య వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ‘ఎన్జీకే’ బయోపిక్ కాదని, సమాజంలో జరిగే విషయాలే తెరపై ఉంటాయని స్పష్టం చేశారు. ఓ పార్టీకో, నాయకుడికో, ప్రాంతానికో అన్వయించే కథ కాదని, అందరి కథలా అనిపిస్తుందని చెప్పారు.
తన మిత్రుడు వైఎస్ జగన్ ఏపీ సీఎం కానున్న విషయంపై సూర్య స్పందిస్తూ, పదేళ్ల పాటు జగన్ పడ్డ కష్టానికి దక్కిన ప్రతిఫలమిదని, తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. జగన్ ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ఆకాంక్షించారు. సీఎం కానున్న జగన్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, వాటన్నింటినీ ఆయన ఎదుర్కొంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు.