telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వ్యవసాయ చట్టాలపై స్టే విధించిన సుప్రీం కోర్టు…

court

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై స్టే విధించింది సుప్రీంకోర్టు. ఈ వ్యవహారంలో పూర్తి తీర్పు వచ్చే వరకు చట్టాలపై స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇక, ఇదే సమయంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు.. నిపుణులతో కమిటీ ఏర్పాటు కానుండగా.. చట్టాలపై అనుకూల, ప్రతికూల వాదనలు విననున్న కమిటీ.. ఆ వాదనల తర్వాత సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వనుంది.. అయితే, వ్యవసాయ చట్టాల అమలును నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతాయని స్పష్టం చేసింది. వ్యవసాయ సంస్కరణలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ ఎస్‌ఐ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.. సమస్య పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటుకు పేర్లను సిఫారసు చేయాలని కోరింది.. వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటి, డాక్టర్ ప్రమోద్ జోషి, అనిల్ ధనవత్, బికెయు అధ్యక్షుడు జితేందర్ సింగ్ మాన్‌తో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సమస్యను పరిష్కరించడానికి, వివాదాస్పదమైన చట్టాన్ని నిలిపివేసే అధికారం తనకు ఉందని, కొత్త వ్యవసాయ చట్టాలపై ఉన్న ప్రతిష్టంభనను పరిష్కరించడానికి ఒక కమిటీని తయారు చేయకుండా.. ఏ అధికారాన్ని నిరోధించలేమని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. మరోవైపు… నిరసనకారులందరినీ ఒక సాధారణ సైట్‌కు తరలించాలన్న ఉత్తర్వు జారీ చేయడానికి ఉన్నత న్యాయస్థానం మొగ్గు చూపుతోంది. సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వేసిన పిటిషన్‌లో రామ్‌లీలా మైదాన్ లేదా బోట్ క్లబ్‌ను సిఫారసు చేశారు.

Related posts