telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

మాజీ సైనికుడి .. ఫిర్యాదులను పరిశీలించాలి .. : సుప్రీం కోర్టు

supreme court two children petition

బీఎస్‌ఎఫ్‌ మాజీ జవాన్‌, ప్రధాని మోదీపై వారణాసి నుంచి పోటీకి దిగి నామినేషన్‌ను తిరస్కరించడంపై ఆయన చేస్తున్న ఫిర్యాదులను పరిశీలించాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీనిపై గురువారానికి సమాధానంతో సిద్ధంగా ఉండాలని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం దీనిపై విచారణ జరిపింది. ఆయన తరఫున కోర్టులో వాదించిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మీడియాతో మాట్లాడుతూ.. ”తేజ్‌బహదూర్ పిటిషన్‌ను ఈరోజు కోర్టు విచారించింది. ఆయన ఫిర్యాదును పరిశీలించి రేపటి కల్లా సమాధానం చెప్పాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఆయనను క్రమశిక్షణారాహిత్య చర్యల కింద విధుల నుంచి బహిష్కరించలేదని.. కేవలం వారు ఇచ్చిన ఆహారాన్ని తిరస్కరించినందుకు మాత్రమే తొలగించారని కోర్టుకు వివరించాం.

క్రమశిక్షణారాహిత్య చర్యల కింద విధుల నుంచి తొలగించలేదని ఎన్నికల సంఘం నుంచి ధ్రువపత్రం తీసుకురావాలని రిటర్నింగ్ ఆఫీసర్‌ కోరుతున్నారని తెలిపాం. మా వాదనలు విన్న కోర్టు.. ఈ అంశాన్ని పరిశీలించాలని ఈసీని ఆదేశించింది” అని తెలిపారు. ప్రధాని మోదీపై ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్డీ కూటమి అభ్యర్థిగా తేజ్‌బహదూర్ నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే సరైన సమాచారాన్ని పొందుపరచలేదని, కేంద్ర ప్రభుత్వ విధుల నుంచి తొలగించడానికి గల కారణాలకు సంబంధించి సరైన ఆధారాలు సమర్పించడంలో యాదవ్‌ విఫలమయ్యారని పేర్కొంటూ ఆయన నామినేషన్‌ను ఈసీ తిరస్కరించింది. దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఆయన.. తన నామినేషన్‌ను ఈసీ కావాలనే తిరస్కరించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Related posts