telugu navyamedia
రాజకీయ

ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల్లో సీబీఐ, ఈడీపై సుప్రీంకోర్టు సీరియస్

దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల్లో దర్యాప్తు నత్తనడకన సాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా కేసుల్లో కనీసం ఛార్జిషీట్లు కూడా దాఖలు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. దీనికి గల కారణాలను వెల్లడించాలని ఆదేశించింది. మనీలాండరింగ్ వంటి కేసుల్లో ఛార్జిషీట్లు లేకుండా కేవలం ఆస్తులు జప్తు చేస్తే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించింది.

ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల స్థితిగతులపై అమికస్ క్యూరీ తాజాగా సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం దర్యాప్తు సంస్థల తీరుపై అసంతృప్తి వ్యక్తంచేసింది.

మనీలాండరింగ్ కేసుల్లో 51 మంది ఎంపీలు, 71 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిందితులుగా ఉన్నట్లు అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా సుప్రీంకోర్టుకు సమర్పించిన తన నివేదికలో పేర్కొన్నారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాల్లో 151 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. వీటిలోని 58 కేసుల్లో జీవిత ఖైదు పడే అవకాశముందని.. 45 కేసుల్లో అభియోగాలు కూడా నమోదు కాలేదని వెల్లడించింది.

నివేదిక అసంపూర్తిగా ఉందని, 10 నుంచి 15 ఏళ్ల కిందటి కేసుల్లోనూ కనీసం అభియోగాలు నమోదుచేయలేదని, మనీలాండరింగ్ కేసుల్లో చాలావరకు ఈడీ కేవలం ఆస్తులు జప్తు చేయడం తప్ప ఎలాంటి దర్యాప్తు చేపట్టలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మేం దర్యాప్తు సంస్థలను నిలదీయడం లేదని, న్యాయమూర్తుల్లా వారిపైనా అధికభారం ఉందని కాబట్టే సంయమనం పాటిస్తున్నామని అన్నారు.

చాలా కేసుల్లో దర్యాప్తులపై హైకోర్టులు స్టే విధించాయని, అందుకే ఆలస్యమవుతున్నాయని ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బదులిచ్చారు. ఎస్‌జీ సమాధానంపైనా సీజేఐ అసహనం వ్యక్తంచేశారు. కేవలం 8 కేసుల్లోనే కోర్టుల నుంచి స్టే ఉత్తర్వులు ఉన్నాయని అన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను అలాగే వదిలేయడం సరికాదని, కనీసం ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

Related posts