కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని గతేడాది ఇచ్చిన ఆదేశాలను పునఃపరిశీలించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. శబరిమల వ్యవహారం విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.
విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని మెజార్టీ న్యాయమూర్తుల నిర్ణయం తీసుకోవడంతో ఈ తీర్పు ఇచ్చింది.శబరిమల కేసు ఏడుగురు సభ్యుల బెంచ్ ముందుకెళ్లనుంది. సమీక్ష పిటిషన్లన్నీ సుప్రీంకోర్టు పెండింగ్ లో ఉంచింది. గతంలో ఇచ్చిన తీర్పును న్యాయమూర్తులు చంద్రచూడ్, జస్టిస్ నారిమన్ వ్యతిరేకించారు. ఈ కేసు ముస్లిం మహిళలు మసీదుల్లోకి ప్రవేశం అనే ప్రశ్నను కూడా లేవనెత్తుతోందని సుప్రీంకోర్టు పేర్కొంది. సమీక్ష పిటిషన్ తో పాటు అనేక రిట్ పిటిషన్లు దాఖలయ్యాయని, మతంలో అంతర్గత భాగంగా ఉన్న విషయాలపై చర్చ జరపాలని పిటిషనర్లు కోరారని తెలిపింది.
ఒకే మతంలో ఉన్న వివిధ వర్గాల వారికి నచ్చిన విధానాలు ఆచరించే స్వేచ్ఛ ఉందని చెప్పింది. మతంలోకి చొచ్చుకునే అధికారం కోర్టులకు ఉందా? అనే అంశం ఇప్పుడు చర్చకు వచ్చిందని పేర్కొంది. మసీదుల్లో మహిళలకు ప్రవేశం అన్న విషయం కూడా చర్చకు వచ్చిందని తెలిపింది. మతపరమైన విశ్వాసాలను తక్కువ చేయడం తగదని అభిప్రాయపడింది.