telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వ్యవసాయ చట్టాలపై నేడు సుప్రీం తీర్పు…

court

వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగేదాకా చట్టాలపై స్టే ఇవ్వాలనుకుంటున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. కేంద్రం వ్యవహరిస్తున్న వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు.. సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆక్షేపించింది. సాగు చట్టాల అమలును ప్రభుత్వం నిలిపివేయకపోతే.. తామే  స్టే విధిస్తామంది. సమస్య పరిష్కారానికి కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదిస్తామన్నారు  చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే. తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పలు పిటిషన్లపై కోర్టు విచారణ జరిపింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. సాగు చట్టాలపై కేంద్రం, రైతుల మధ్య జరుగుతున్న ప్రక్రియ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు కోర్టు తెలిపింది.. అసలు చర్చల్లో ఏం జరుగుతుందో తెలియట్లేదని ఆక్షేపించింది. ఆందోళనల్లో పాల్గొన్న కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలు, వృద్ధులు కూడా ఆందోళనల్లో పాల్గొంటున్నారని గుర్తుచేసింది. ఏదైనా తప్పు జరిగితే మనలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సి ఉంటుందంది. మా చేతులకు రక్తం అంటుకోవాలని మేం కోరుకోవట్లేదు’ అని సీజేఐ జస్టిస్‌ బోబ్డే కేంద్రంపై అసహనం వ్యక్తం చేశారు. దేశమంతా మీ చట్టాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తోందని ధర్మాసనం తెలిపింది. సమస్య పరిష్కారానికి కమిటీని ప్రతిపాదిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఈ కమిటీ తన నివేదిక ఇచ్చేవరకు వ్యవసాయ చట్టాల్ని నిలిపివేయాలనే ఆలోచనతో ఉన్నామని వెల్లడించింది. కమిటీ ఏర్పాటుకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు లేదా న్యాయమూర్తుల పేర్లు ఇవ్వాలని సొలిసిటర్‌ జనరల్‌ను కోరింది. మాజీ సీజేఐ జస్టిస్‌ ఆర్‌ఎం లోధా అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ధర్మాసనం తెలిపింది. సమస్య పరిష్కారం కోసం కోర్టు ఏర్పాటు చేసే కమిటీ ముందుకు వెళ్లాలని రైతులను ధర్మాసనం కోరింది. తమ సమస్యలను కమిటీకి నివేదిస్తే.. వాటిని కోర్టు పరిశీలిస్తుందని తెలిపింది.

Related posts