కశ్మీర్‌లో జరిగిన పుల్వామా కారు బాంబు దాడి తర్వాత.. ఇండియన్ ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ సరికొత్త ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా తుపాకీతో కనిపిస్తే వాళ్లను వెంటనే తుద ముట్టిస్తామని ఇండియన్ ఆర్మీ ఇవాళ హెచ్చరించింది. కార్ప్స్ కమాండర్ కన్వల్జిత్ సింగ్ దిల్లాన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ వార్నింగ్ ఇచ్చారు. గన్ పట్టుకుని తిరిగేవాళ్లను రూపుమాపేస్తామన్నారు. పుల్వామా ఫిదాయిన్ దాడి జరిగిన తర్వాత వంద గంటల్లోనే ఆ దాడికి కారణమైన జైషే ఉగ్రవాదులను హతం చేశామన్నారు.
ఈనెల 14వ తేదీన జరిగిన కారు బాంబు దాడి ఘటనపై స్పందిస్తూ.. చాన్నాళ్ల తర్వాత కశ్మీర్‌లో అలాంటి వ్యూహాన్ని అమలు చేశారన్నారు. ఫిదాయిన్ దాడులను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధమైనట్లు ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా కశ్మీరీలపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకుని 14411 హెల్ప్‌లైన్‌ను స్టార్ట్ చేసినట్లు సీఆర్‌పీఎఫ్ ఆఫీసర్ జుల్ఫీకర్ హసన్ తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో చదువుతున్న కశ్మీరీ విద్యార్థులకు భద్రతా దళాలు అండగా నిలుస్తున్నాయన్నారు. ఉగ్రవాద రిక్రూట్మెంట్‌లో గణనీయమైన తరుగుదల కనిపించిందని కశ్మీర్ ఐజీ ఎస్పీ పాణి తెలిపారు. గత మూడు నెలల్లో ఎటువంటి రిక్రూట్మెంట్ జరగలేదని ఆయన చెప్పారు.