telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సామ్రాజ్యవాద ముసుగులో…శాంతిని విచ్చిన్నం చేసే కుట్రలు .. : రాష్ట్ర ప్రణాళిక సంఘ వైస్ చైర్మన్ వినోద్ కుమార్

state planning commission vice chairmen on

సామ్రాజ్యవాద ముసుగులో శాంతిని విచ్చిన్నం చేసే కుట్రలు జరుగుతున్నాయని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ ముసుగులో అణ్వాయుధాలతో విధ్వంసాలు, మతాల పేరిట ఘర్షణలు సృష్టించేందుకు ప్రపంచ వ్యాప్తంగా కుట్రలు సాగుతున్నాయనీ, వాటిని తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. దోపిడీని, అశాంతిని నెలకొల్పే స్వభావం ఉన్న అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాల విషయంలో లోతుగా ఆలోచించే సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. సూడాన్, ఈజిప్టు వంటి పలు దేశాల్లో ఇప్పటికీ అశాంతి కొనసాగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్రికన్ దేశాలతో పాటు సుమారు 40, 50 దేశాల్లో చిన్నా, చితక యుద్దాలు జరుగుతూనే ఉన్నాయని వినోద్ కుమార్ తెలిపారు. ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అందుకోసం తమ నివాస ప్రాంతం నుంచే శాంతికి శ్రీకారం చుట్టాలని ఆయన సూచించారు.

శాంతి, సౌభ్రాతృత్వం కోసం విద్యార్థులు, యువతను తగిన రీతిలో తీర్చి దిద్ది, వారిని ఆ రంగంలో ఉపయోగించే విషయంలో మేధావులు కృషి చేయాలని ఆయన కోరారు. ఇటీవలి తన అమెరికా పర్యటనలో ఆసక్తికరమైన విషయాలు దృష్టికి వచ్చాయనీ, అక్కడి యువత తాము ఆర్థికంగా ఎదగడం కన్నా సోషలిజం వైపు మొగ్గుచూపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందరికీ సమానత్వం కావాలని అమెరికా యువత కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆహ్వాన సంఘం చైర్మన్ కాచం సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఎం రాష్ట్ర సమితి కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కాంగ్రెస్ నాయకులు యాదవ రెడ్డి, ఓబేదుల్లా కొత్వాల్, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, శాంతి సంఘీభావ సంఘం నాయకులు పల్లబ్ సేన్ గుప్తా, అరుణ్ కుమార్, కె వి ఎల్, తిప్పర్తి యాదయ్య, జగన్మోహన్, రఘుపాల్, డాక్టర్ దిద్ది సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts